రష్యాలోని దక్షిణ రిపబ్లిక్ ఆఫ్ డాగేస్తాన్‌లోని గ్యాస్ స్టేషన్‌లో భారీ పేలుడు సంభవించి 27 మంది మరణించారు. ఈ ఘటనలో మరో 100 మందికి పైగా గాయపడినట్లు స్థానిక అధికారులు మంగళవారం తెలిపారు. మరణించిన వారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారని డాగేస్తాన్ గవర్నర్ సెర్గీ మెలికోవ్ తెలిపారు.
ఈ ప్రాంత రాజధాని మఖచ్కల శివార్లలో సోమవారం రాత్రి పేలుడు సంభవించింది. కారు రిపేరింగ్ సెంటర్‌లో మంటలు ప్రారంభమై సమీపంలోని గ్యాస్ స్టేషన్‌కు వ్యాపించడంతో పేలుడు సంభవించిందని రష్యా ప్రభుత్వ వార్తా సంస్థ RIA నోవోస్టి దేశ అత్యవసర మంత్రిత్వ శాఖను ఉటంకిస్తూ నివేదించింది. పేలుడు దాటికి 600 చదరపు మీటర్ల (గజాలు) వరకూ మంటలు చెలరేగాయని నివేదికలు పేర్కొన్నాయి. గాయపడిన వారిలో కొందరిని చికిత్స కోసం మాస్కోకు విమానంలో తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. రష్యా అధికారులు నేర విచారణ ప్రారంభించారు.