ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త డ్రెస్ కోడ్‌ను అమలు చేశారు. కొత్త మార్గదర్శకాల ప్రకారం.. ప్రభుత్వ పురుష ఉద్యోగులు గడ్డంతో విధులకు హాజరుకావాలనే నిబంధనను తీసుకొచ్చారు. అలాగే వారు పాశ్చాత్య సూట్లు ధరించకూడదని హుకుం జారీ చేశారు. ఆఫ్ఘాన్ ఉద్యోగులు.. తమ తలపై టోపీ లేదా తలపాగా ధరించాలి. అలాగే ఒంటిపై సంప్రదాయ పొడవాటి టాప్స్, ప్యాంటు ధరించాలని నిబంధనలు జారీ చేసినట్లు ది ఇండిపెండెంట్ నివేదించింది. ఇస్లామిక్ చట్టం ప్రకారం.. తెల్లవారుజాము నుంచి సాయంత్రం మధ్య సరైన సమయాల్లో ఆరుసార్లు ప్రార్థన చేయాలనే నిబంధన ఉంది.
ఈ నేపథ్యంలోనే కోడ్‌ను ఉల్లంఘిస్తే ఉద్యోగులు తమ కార్యాలయాల్లోకి ప్రవేశించడానికి అనుమతించబడరని.. చివరికి ఉద్యోగం నుంచి తొలగించబడవచ్చని తాలిబాన్ తెలిపింది. ఈ వారం ప్రారంభంలో తాలిబాన్ మంత్రిత్వ శాఖ అధికారులు.. ప్రభుత్వ కార్యాలయాల్లోకి పురుష ఉద్యోగులు ప్రవేశించినప్పుడు వారిని తనిఖీ చేయడం కనిపించింది. మంగళవారం నుంచి కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వచ్చాయి.