టర్కీలో మళ్లీ భూకంపం.. భయంతో రాత్రంతా వీధుల్లోనే జనం
టర్కీలోని పశ్చిమ ప్రాంతంలో సోమవారం భూకంపం సంభవించింది.
By - Medi Samrat |
టర్కీలోని పశ్చిమ ప్రాంతంలో సోమవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదైంది. డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ (AFAD) ప్రకారం.. భూకంప కేంద్రం బాలకేసిర్ ప్రావిన్స్‌లోని సిందిర్గి పట్టణంలో ఉండగా.. ప్రకంపనలు ఇస్తాంబుల్, బుర్సా, మనీసా, ఇజ్మీర్ ప్రావిన్స్‌లలో కూడా కనిపించాయి. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10:48 గంటలకు 5.99 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది.
ఈ ప్రకంపనల ధాటికి సిందిర్గి పట్టణంలో మూడు భవనాలు, రెండంతస్తుల దుకాణం కూలిపోయాయి. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. కూలిపోయిన భవనాలు ఇప్పటికే ఖాళీగా ఉన్నాయని టర్కీ అంతర్గత మంత్రి అలీ యెర్లికాయ చెప్పారు. మరోవైపు గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. సిందిర్గి జిల్లా అధికార యంత్రాంగం ద్వారా ఎటువంటి మరణం నిర్ధారించబడలేదు. అయితే మా సమీక్ష కొనసాగుతోంది. భూకంపంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారని, దీని కారణంగా చాలా మంది రాత్రిపూట వీధుల్లోనే గడిపారని ఆయన అన్నారు.
ఇదిలావుంటే.. గత ఆగస్టులో కూడా వాయువ్య ప్రావిన్స్‌లోని బాలకేసిర్‌లోని సిందీరాగిలో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. అప్పుడు ఒక వ్యక్తి మరణించాడు. డజన్ల కొద్దీ గాయపడ్డారు. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో చిన్నపాటి ప్రకంపనలు వస్తూనే ఉన్నాయి.