ఇటలీలోని అత్యంత ప్రమాదకరమైన మాఫియా సంస్థలలో అతడు పని చేశాడు. ఎన్నో క్రైమ్ లు కూడా చేశాడు. కానీ 16 సంవత్సరాలుగా పోలీసులకు దొరకలేదు. అతడు గురువారం నాడు ఫ్రాన్స్‌లో పట్టుబడ్డాడు. అదేదో సినిమాల్లో చూసిన సీన్ లాగా.. పిజ్జాలను తయారు చేసే చెఫ్‌గా పని చేసుకుంటూ ఉన్నాడు. అతడిని పట్టుకుని అరెస్టు చేశారు. ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ ఇంటర్‌పోల్, ఎడ్గార్డో గ్రెకో అనే 63 సంవత్సరాల వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. గ్రెకో 16 సంవత్సరాలకు పైగా పరారీలో ఉన్నాడు. చివరకు ఫ్రెంచ్ ఆల్ప్స్ ప్రాంతంలోని సెయింట్-ఎటియెన్ లో పట్టుబడ్డాడు. లియోన్‌లోని ఇన్వెస్టిగేటింగ్ మేజిస్ట్రేట్ ముందు హాజరయ్యాడు గ్రెకో. ఇప్పుడు నిర్బంధంలో ఉన్నాడు.
అతను దక్షిణ ఇటలీలోని కాలాబ్రియా ప్రాంతానికి చెందిన క్రైమ్ సిండికేట్ 'Ndrangheta' తో సంబంధాలు కలిగి ఉన్నాడు. 2006లో తన ఇద్దరు ప్రత్యర్థులు - స్టెఫానో, గియుసెప్పీ బార్టోలోమియోలను చంపినందుకు ఇటాలియన్ కోర్టు ఎడ్గార్డో గ్రెకో కు జీవిత ఖైదు విధించింది. వారి మృతదేహాలు అసలు కనిపించలేదు. శవాలను కరిగించడానికి గ్రీకో యాసిడ్‌ను ఉపయోగించినట్లు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. గ్రీకో కొంతకాలం తర్వాత పోలీసు కస్టడీ నుండి తప్పించుకున్నాడు. అతను తన సొంత హోటల్ ను ఏర్పాటు చేయడానికి ముందు అనేక రెస్టారెంట్లలో పనిచేశాడు. తన మారుపేరుతో బ్రతికాడు. గ్రీకో తన రెస్టారెంట్ వంటకాలను మార్కెట్ చేయడానికి స్థానిక TV, వార్తాపత్రికల ప్రకటనలలో కూడా కనిపించాడు.