విమానాలు కొన్ని కొన్ని సార్లు చిన్న చిన్న అంతరాయాలకే ఆపివేయడమో.. లేకపోతే వాటి బదులుగా వేరేవి ప్రత్యమ్నాయంగా తీసుకుని రావడమో జరుగుతూ ఉంటుంది. తాజాగా అలాంటి ఘటనే ఎయిర్ ఇండియా విమానం విషయంలో చోటు చేసుకుంది. బిజినెస్ క్లాసు విమానంలో చీమలు కనిపించడంతో ఏకంగా వేరే విమానాన్నే తీసుకుని వచ్చారు.
ఢిల్లీ నుంచి లండన్ వెళ్లాల్సిన ఒక విమానాన్ని ఎయిరిండియా చివరి నిమిషంలో ఆపేసింది. దాని స్థానంలో మరో విమానాన్ని ఉపయోగించింది. సోమవారం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్ వే మీద ఉన్న విమానంలోని బిజినెస్ తరగతి విభాగంలో చీమలు కనిపించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రయాణికుల్లో భూటాన్ యువరాజు జిగ్మే నామ్‌గ్యేల్ వాంగ్‌చుక్ కూడా ఉన్నారట. ప్రయాణం ప్రారంభించే ముందు బిజినెస్ క్లాస్ సీట్ల వద్ద చీమలు ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతో ఎయిరిండియా ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఏది ఏమైనా చీమల కారణంగా ఏకంగా విమానాన్ని మార్చేశారు.
"బిజినెస్ క్లాస్‌లో చీమల గుంపు కనిపించడంతో లండన్ వెళ్లే ఎయిర్ ఇండియా (AI-111) విమానం ఢిల్లీ విమానాశ్రయంలో టేకాఫ్ నిలిపివేసింది. భూటాన్ యువరాజు అందులో ఉన్నారు. తరువాత ఎయిర్ ఇండియా విమానాన్ని మార్చింది." అంటూ పలు మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి.