ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ లోని సైనిక ఆసుపత్రి సమీపంలో మంగళవారం నాడు రెండు పేలుళ్లకు గురైనట్లు తాలిబాన్ అధికారులు తెలిపారు. అలాగే కాల్పులు కూడా జరిపినట్లు తెలుస్తోంది. "నేను ఆసుపత్రిలో ఉన్నాను. మొదటి చెక్‌పాయింట్ నుండి పెద్ద పేలుడు శబ్దం వినిపించింది. మమ్మల్ని సేఫ్ రూమ్‌లకు వెళ్లమని చెప్పారు. నాకు తుపాకీ కాల్పులు కూడా వినిపించాయి" అని కాబూల్‌లోని సర్దార్ మహ్మద్ దౌద్ ఖాన్ ఆసుపత్రి వైద్యుడు మీడియాకి చెప్పారు. మొదటి పేలుడు జరిగిన రెండు నిమిషాల తర్వాత రెండవ పేలుడు చోటు చేసుకుంది. రెండు పేలుళ్లను తాలిబన్ మీడియా ప్రతినిధి ధృవీకరించారు.
"ఒక పేలుడు సైనిక ఆసుపత్రి గేట్ వద్ద జరిగింది.. ఇంకొకటి ఆసుపత్రికి సమీపంలో ఎక్కడో జరిగింది.. ఇది మా ప్రాథమిక సమాచారం, మేము మరిన్ని వివరాలను తరువాత అందిస్తాము" అని తాలిబాన్ మీడియా ప్రతినిధి తెలిపారు. తాలిబాన్లకు చెందిన స్పెషల్ ఫోర్స్ లు ఘటనా స్థలానికి చేరుకున్నాయని తాలిబాన్ ప్రతినిధులు వెల్లడించారు. ఈ బాంబ్ బ్లాస్ట్స్ కు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.