పోర్న్ స్టార్‌కు డబ్బు చెల్లించిన కేసులో ట్రంప్‌కు శిక్ష.? ప్రమాణ స్వీకారం చేస్తారా.?
కొత్తగా ఎన్నికైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కష్టాలు పెరిగే అవకాశం ఉంది.
By Medi Samrat Published on 4 Jan 2025 9:56 AM ISTకొత్తగా ఎన్నికైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కష్టాలు పెరిగే అవకాశం ఉంది. హుష్ మనీ కేసులో ట్రంప్‌కు శిక్ష పడనుందని నివేదికలు పేర్కొంటున్నాయి. జనవరి 10న ట్రంప్ కోర్టుకు హాజరుకానున్నారు. పోర్న్ స్టార్‌తో సంబంధం పెట్టుకుని.. ఆమె నోరు విప్పకుండా మౌనంగా ఉండేందుకు డబ్బు చెల్లించారనే ఆరోపణలపై నమోదైన క్రిమినల్ కేసులో దోషిగా తేలడంతో ట్రంప్‌కు శిక్ష విధించబడుతుందని నివేదికలు చెబుతున్నాయి.
ఈ కేసులో ట్రంప్‌కు జైలు శిక్ష పడుతుందా లేదా మరేదైనా శిక్ష పడుతుందా అనేది తెలియాల్సివుందని ఒక న్యాయమూర్తి అన్నారు. జస్టిస్ జువాన్ మార్చెంట్ నిర్ణయం ప్రకారం.. ట్రంప్ జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయడానికి కేవలం 10 రోజుల ముందు కోర్టు విచారణకు హాజరుకావలసి ఉంటుంది. అమెరికా చరిత్రలో ట్రంప్ కంటే ముందు అధ్యక్షులెవరూ ఏ కేసులో దోషిగా తేలలేదు. శిక్ష విధించే సమయంలో ట్రంప్ వ్యక్తిగతంగా హాజరుకావాల్సి ఉంటుందని ఈ కేసులో న్యాయమూర్తి తెలిపారు. ట్రంప్‌ను జైలుకు పంపడం తనకు ఇష్టం లేదని, షరతులు లేకుండా విడుదల చేసే అవకాశం ఉందని న్యాయమూర్తి అన్నారు. ఈ శిక్షపై ట్రంప్ కూడా అప్పీలు చేసుకోవచ్చన్నారు.
2006లో ఓ పోర్న్ స్టార్‌తో ట్రంప్ లైంగిక సంబంధాలు పెట్టుకున్నారని ఆరోపణలు వచ్చాయి. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో ఈ విషయం చాలా చర్చనీయాంశమైంది. పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ ఈ విషయాన్ని బయటపెడతానని బెదిరించింది. ఆ తర్వాత ఆమె మాట్లాడకుండా మౌనంగా ఉండేందుకు ఆమెకు డబ్బు చెల్లించారు. ట్రంప్ మాజీ న్యాయవాది మైఖేల్ కోహెన్ స్టార్మీ డేనియల్స్‌కు కోటి రూపాయలకు పైగా చెల్లించారు. ఈ డబ్బు 2016 ఎన్నికల ముందు నోరెత్తకుండా నిశ్శబ్దం ఉండేందుకు చెల్లించారు. తదనంతరం మేలో ట్రంప్ చెల్లింపులను కప్పిపుచ్చడానికి.. వ్యాపార రికార్డులను తప్పుదోవ పట్టించినందుకు మాన్హాటన్ జ్యూరీ ఆయనను దోషిగా నిర్ధారించింది.