అమెరికా అధ్యక్ష పీఠం దిగిపోయే ముందు డొనాల్డ్ ట్రంప్ ఎన్నో వివాదాస్పద తీసుకున్న సంగతి తెలిసిందే..! ఇక కొత్తగా అధ్యక్షపీఠం ఎక్కిన జో బైడెన్ మాత్రం ట్రంప్ చేసిన తప్పులను సరిదిద్దే పనిలో పడ్డారు. హెచ్1బీ వీసాలపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన మూడు వివాదాస్పద ఉత్తర్వులతో నష్టం జరిగిన వ్యక్తులకు న్యాయం చేస్తామని బైడెన్ ప్రభుత్వం ప్రకటించింది. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో నష్టం జరిగిందని ఎవరైనా ఫార్మ్ ఐ–129బీ (అప్పీల్ నోటీస్ లేదా మోషన్)లో వివరాలు నింపి పిటిషన్ వేస్తే.. వారి దరఖాస్తును పున:సమీక్షించి, ఆ నష్టాన్ని పూడుస్తామని అమెరికా పౌరసత్వ, వలస విధాన సేవల విభాగం (యూఎస్ సీఐఎస్) ప్రకటించింది.
ఈ నిర్ణయంతో చాలా మంది భారతీయులకు ఊరట కలగనుంది. అనివార్య పరిస్థితుల్లో అలాంటి అప్పీళ్లను పరిగణనలోకి తీసుకునే అధికారం తమకు ఉంటుందని వెల్లడించింది. ట్రంప్ ఆదేశాలు ఇచ్చిన నాటికి సదరు వ్యక్తి హెచ్1బీ వీసా గడువు ముగిసిపోక ముందే దరఖాస్తు చేసి ఉండాలని లేదా ట్రంప్ ఆదేశాలకు నెల రోజుల తర్వాత వీసాకు దరఖాస్తు చేసి ఉండాలని సూచించింది. ట్రంప్ ప్రకటించిన ఆ మూడు విధానాల్లో ఏదో ఒక దాని వల్ల నష్టం కలిగినట్టు తేలితే.. తాము వారి దరఖాస్తులను పున:పరిశీలిస్తామని స్పష్టం చేసింది.