ఇండోనేషియా దేశంలో పిల్లలకు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. మంగళవారం నుండి 6 నుండి 11 ఏళ్ల వయస్సున్న పిల్లలకు వ్యాక్సిన్ వేయాలని ఇండోనేషియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ యొక్క తాత్కాలిక డైరెక్టర్ జనరల్ ఆఫ్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ మాక్సీ రీన్ రొండోనువు చెప్పారు. 6 నుండి 11 సంవత్సరాల వయస్సు గల పిల్లలు ఇండోనేషియాలో 26.5 మిలియన్ల మంది ఉన్నారు. కాగా పిల్లలకు సినోవాక్ వ్యాక్సిన్‌ను ఇవ్వాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందు కోసం 6.4 మిలియన్ల డోసులను వినియోగించనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి బుడి గునాడి సాదికిన్ తెలిపారు.
ఇప్పటి వరకు ఇండోనేషియాలో 0 నుంచి 18 ఏళ్ల వయసున్న పిల్లలు 3,51,336 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వ్యాక్సిన్ ప్రక్రియ అనేక ప్రాంతాలలో ప్రారంభించబడుతుందని అధికారులు చెప్పారు. 6 నుండి 11 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు వచ్చే ఏడాది వరకు క్రమంగా వ్యాక్సినేసన్ కొనసాగుతుందన్నారు. 106 నగరాల్లో 8.8 మిలియన్ల మంది పిల్లలు నివసిస్తున్నారు. కాగా కొలంబియా, ఈక్వెడార్, హాంకాంగ్ వంటి అనేక చోట్ల పిల్లలకు చైనా తయారు చేసిన సినోవాక్ వ్యాక్సిన్ ఇస్తున్నారు.
పాఠశాలలతో పాటు ఇతర విద్యా కేంద్రాలు, అనాథ శరణాలయాల్లో కూడా టీకా సర్వీస్ పోస్టులు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. కోవిడ్-19 ఇన్‌ఫెక్షన్ రేట్లు ప్రస్తుతం ఇండోనేషియాలో తక్కువగా ఉన్నాయి. గత 24 గంటల్లో కేవలం 163 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 5,158కి చేరుకుంది.