అమెరికాలోని టార్గెట్ స్టోర్ లో దొంగతనం చేస్తూ పట్టుబడిన తర్వాత పోలీసుల విచారణ గదిలో ఒక భారతీయ మహిళ ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. "వెన్ ఎ సీరియల్ టార్గెట్ షాప్‌లిఫ్టర్ ఈజ్ ఫైనల్లీ కాట్ రెడ్-హ్యాండెడ్"(“When a Serial Target Shoplifter is Finally Caught Red-Handed”) అనే శీర్షికతో యూట్యూబ్‌లో షేర్ చేసిన ఈ వీడియో జనవరి 15న జరిగిన సంఘటన అని తెలుస్తోంది. అయితే ఈ వీడియో నాలుగు రోజుల క్రితం అప్‌లోడ్ చేశారు. అయితే ఈ వీడియో ప్రామాణికతను మేము ధృవీకరించలేకపోయాము. విచారణ గదిలో భయంతో ఉన్న మహిళ చేతులు ముడుచుకుని కూర్చుని ఉండగా, పోలీసు అధికారులు ఆమెను ప్రశ్నిస్తుండగా వీడియో ప్రారంభమవుతుంది. విచారణ ప్రారంభమయ్యే ముందు ఆమెను తనిఖీ చేశారు. ఆ తర్వాత క్షణాల్లోనే ఆమె కన్నీళ్లు పెట్టుకుంది.
ఆమె ప్రాథమిక భాష గురించి అడిగినప్పుడు, ఆ మహిళ "గుజరాతీ" అని సమాధానం ఇచ్చింది. "ఎక్కడి నుండి వచ్చారు?" అని ఒక అధికారి అడిగాడు. ఆమె "భారతదేశం" అంటూ ఏడుస్తూ సమాధానం ఇవ్వడం వీడియోలో చూడొచ్చు. "నువ్వు దుకాణంలో దొంగతనం చేస్తూ పట్టుబడ్డావు కాబట్టి ఇక్కడ ఉన్నావు. నీ దగ్గర ఏదైనా గుర్తింపు కార్డు ఉందా?" అంటూ ప్రశ్నించారు. ఆ తర్వాత మహిళ వాటిని తిరిగి అమ్మే ఉద్దేశ్యంతో దుకాణం నుండి వస్తువులను దొంగిలించానని ఒప్పుకుంది. ఆమె చాలా ఏడుస్తూ "దయచేసి నన్ను వదిలేయండి. నేను ఇంకెప్పుడూ ఇలా చేయను" అని వేడుకుంటూ ఉండడం వీడియోలో చూడొచ్చు.