అమెరికాలో భారతీయ మహిళ సహా నలుగురు మృతి.. కుటుంబ కలహాల కార‌ణంగానే..

అమెరికాలోని జార్జియా రాష్ట్రం లారెన్స్‌విల్లే నగరంలో కుటుంబ కలహాలతో నలుగురు వ్యక్తులు కాల్చి చంపబడిన హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది.

By -  Medi Samrat
Published on : 24 Jan 2026 12:40 PM IST

అమెరికాలో భారతీయ మహిళ సహా నలుగురు మృతి.. కుటుంబ కలహాల కార‌ణంగానే..

అమెరికాలోని జార్జియా రాష్ట్రం లారెన్స్‌విల్లే నగరంలో కుటుంబ కలహాలతో నలుగురు వ్యక్తులు కాల్చి చంపబడిన హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. మృతుల్లో భారత మ‌హిళ‌ కూడా ఉంది. స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. శుక్రవారం ఉదయం లారెన్స్‌విల్లే నగరంలో జరిగిన ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు మరణించారు. ఘటన జ‌రిగిన సమయంలో ముగ్గురు పిల్లలు ఇంట్లో ఉన్నారు. అయితే చిన్నారులు అల్మారాలో దాక్కొని పోలీసులకు ఫోన్ చేసి తమ ప్రాణాలను కాపాడుకున్నారు.

ఈ సంఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ.. జార్జియా రాజధాని అట్లాంటాలోని భారత రాయబార కార్యాలయం ట్విట్టర్‌లో ఇలా రాసింది.. 'కుటుంబ వివాదానికి సంబంధించిన విషాద కాల్పుల ఘటనతో మేము చాలా బాధపడ్డాము. ఇందులో భారతీయ మ‌హిళ‌ కూడా బాధితుల్లో ఉన్నారు. కాల్పులు జ‌రిపిన షూటర్‌ను అరెస్టు చేశారు. బాధితురాలి కుటుంబానికి సాధ్యమైన సహాయం అందించబడుతోంది.

నిందితుడిని అట్లాంటాకు చెందిన విజయ్ కుమార్ (51)గా గుర్తించారు. గ్విన్నెట్ కౌంటీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతులు విజయ్ కుమార్ భార్య మీము డోగ్రా (43), గౌరవ్ కుమార్ (33), నిధి చందర్ (37), హరీష్ చందర్ (38)గా గుర్తించారు. నిందితుడి ప‌లు సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేసిన‌ట్లు నివేదిక‌లు పేర్కొన్నాయి.

కాల్పులు ప్రారంభమైన సమయంలో ముగ్గురు చిన్నారులు ఇంట్లోనే ఉన్నారని పోలీసు అధికారులు తెలిపారు. తమను తాము రక్షించుకోవడానికి పిల్లలు అల్మారాలో దాక్కున్నారు. పిల్లలలో ఒకరు 911కి కాల్ చేయగలిగారు. కీలక సమాచారాన్ని అందించారు. నిమిషాల్లో అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పిల్లలు క్షేమంగా ఉన్నార‌ని.. వారిని కుటుంబ సభ్యులు తీసుకెళ్లారని పోలీసులు తెలిపారు.

Next Story