భారతీయులకు హెచ్చరిక.. వెంటనే ఉక్రెయిన్ విడిచి వెళ్లండి
Indian embassy in Kyiv asks nationals to leave Ukraine as soon as possible.ఉక్రెయిన్‌లో ఇంకా భారతదేశ పౌరులు ఎవరైనా
By తోట వంశీ కుమార్ Published on 20 Oct 2022 10:52 AM ISTఉక్రెయిన్‌లో ఇంకా భారతదేశ పౌరులు ఎవరైనా ఉంటే వెంటనే ఆదేశాన్ని విడిచి వెళ్లాలని కీవ్‌లోని ఇండియన్ ఎంబసీ హెచ్చరికలు జారీ చేసింది. ఉక్రెయిన్‌లో పరిస్థితులు క్షీణిస్తున్నాయని, రష్యా చేస్తున్న యుద్ధం ఏ క్షణంలోనైనా తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ ఉండడం సురక్షితం కాదు. కాబట్టి.. భారత పౌరులు, విద్యార్థులు ఇంకా ఎవరైనా ఉక్రెయిన్‌లో ఉంటే సాధ్యమైనంత త్వరగా అందుబాటులో ఉన్న మార్గాల ద్వారా దేశాన్ని విడిచిపెట్టి వెళ్లాలని భారత దౌత్య కార్యాలయం సూచించింది. ఇక ఏ కారణం చేతనైనా ఉక్రెయిన్ రావాలని అనుకునేవారు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరింది. ఈ మేరకు బుధవారం రాత్రి అడ్వైజరీ విడుదల చేసింది.
రష్యా-క్రిమియాను కలిపే కీలకమైన కెర్చ్ వంతెనపై రెండు వారాల క్రితం భారీ పేలుడు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. వంతెన పేల్చివేతకు ఉక్రెయినే కారణమని ఆరోపిస్తూ రష్యా.. ఆ రోజు నుంచి ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మరింత తీవ్రం చేసింది. కీవ్ సహా ఆ దేశ ముఖ్య పట్టణాలపై దాడులు కొనసాగుతున్నాయి. క్షిపిణి దాడులతో విరుచుకుపడుతోంది. అణ్వాయుధాలను ఉపయోగించే ముప్పు ఉన్నట్లు ఆందోళన వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత ఎంబసీ తాజా అడ్వైజరీ జారీ చేసింది.
ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్ దేశంలో తమ అధీనంలోకి వచ్చిన నాలుగు ప్రాంతాల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ మార్షల్ లా విధించారు. ఈ అర్ధరాత్రి నుంచి ఈ చట్టం అమల్లోకి రాబోతోంది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ చట్టాలకు భయపడి కొందరు పడవల్లో ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు.