ఔరంగజేబు పాలనలో తప్ప భారత్ ఎప్పుడూ ఐక్యంగా లేదు.. పాక్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
భారత్‌పై పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
By - Medi Samrat |
భారత్‌పై పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాలనలో తప్ప భారతదేశం "పూర్తిగా ఎప్పుడూ ఐక్యంగా లేదు" అని ఖవాజా ఆసిఫ్ నిరాధారమైన వాదన చేశాడు. అలాగే భారత్‌తో యుద్ధం జరిగే అవకాశం ఉందని, దీన్ని నేను ఖండించడం లేదని ఆసిఫ్ అన్నారు.
మంత్రి ఖవాజా ఆసిఫ్ పాకిస్థాన్ కు చెందిన సామా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్థాన్ నీచమైన ఉద్దేశాలను వెల్లడించాడు. ప్రభుత్వ-ప్రాయోజిత ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వవద్దని లేదంటే భౌగోళిక ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందని భారత్ పాక్‌ను హెచ్చరించిన కొద్ది రోజుల తర్వాత ఖవాజా ఆసిఫ్ ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.
పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ.. ''చరిత్రలో ఔరంగజేబు హయాంలో తప్ప, భారతదేశం ఎన్నడూ ఏకీకృత దేశంగా లేదు. పాకిస్థాన్ అల్లా పేరు మీద సృష్టించబడింది. ఇంట్లో మేము వాదించుకుంటాము.. పోటీ పడతాము.. కానీ భారత్‌తో పోరాటంలో మాత్రం మేము ఐక్యంగా ఉంటాం.. నాకు టెన్షన్‌ని పెంచుకోవడం ఇష్టం లేదని, అయితే యుద్ధ ప్రమాదం వాస్తవమేనని, దానిని నేను తోసిపుచ్చడం లేదని అన్నారు. యుద్ధం వస్తే, ఇన్షా అల్లా, ఇంతకు ముందు కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు.
ఇదిలావుంటే.. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ మళ్లీ దాడి చేస్తుందని పాకిస్థాన్ భయపడుతోంది. భారతదేశం బ్రిటిష్ వలసవాదుల నుండి స్వాతంత్ర్యం పొందినప్పటి నుండి ఏడు దశాబ్దాలకు పైగా స్థిరమైన, ఏకీకృత ప్రజాస్వామ్యం దేశంగా ఉంది. అదే సమయంలో పాకిస్తాన్‌లో సైనిక తిరుగుబాట్లు, అంతర్గత విభేదాలు చాలాసార్లు కనిపించాయి.