స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరుపుతున్న భారతదేశం, దేశీయ పరిశ్రమకు తగిన ప్రోత్సాహకాలను అందించే విషయమై కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నాడు వర్చువల్ సమ్మిట్ లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో మొదటి ద్వైపాక్షిక ఒప్పందంపై సంతకం చేయనుంది. యుఏఇతో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సిఇపిఎ) దేశీయ పరిశ్రమల ప్రయోజనాలను పరిరక్షించడానికి, పశ్చిమాసియా, ఆఫ్రికాలోని మార్కెట్‌లకు ఎంట్రీ పాయింట్ గా మారనుంది. CEPA కోసం చర్చలు సెప్టెంబర్ 2021లో ప్రారంభించబడ్డాయి మరియు పూర్తయ్యాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రధాని నరేంద్ర మోదీ, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మధ్య వర్చువల్ సమ్మిట్ ఫిబ్రవరి 18న నిర్వహించనున్నట్లు ప్రకటించింది. "ఈ ఒప్పందం భారతదేశం-యూఏఈ ఆర్థిక, వాణిజ్య బంధాలను తదుపరి స్థాయికి తీసుకువెళుతుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భారతదేశానికి మూడవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలు గణనీయమైన మెరుగుదలలను చూశాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. UK, ఆస్ట్రేలియా, యూరోపియన్ యూనియన్ (EU), కెనడా, ఇజ్రాయెల్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై (FTAలు) భారత్ ఇప్పటికే చర్చలు జరుపుతోంది.