సౌదీ అరేబియా, పాకిస్థాన్‌ల మధ్య వ్యూహాత్మక రక్షణ ఒప్పందం కుదిరిందన్న వార్త యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అయితే.. ఈ ఒప్పందం ప్రభావంపై భారత్ నిశితంగా పరిశీలిస్తుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. సౌదీ అరేబియా, పాకిస్తాన్ మధ్య వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందంపై సంతకాలు చేస్తున్న వార్తలను మేము చూశాము. రెండు దేశాల మధ్య దీర్ఘకాలిక ఏర్పాట్లను అధికారికం చేసే ఈ పరిణామం పరిశీలనలో ఉందని ప్రభుత్వానికి ముందే తెలుసన్నారు.
మన జాతీయ భద్రతతో పాటు ప్రాంతీయ, ప్రపంచ స్థిరత్వంపై ఈ ఒప్పందం ప్రభావాలను మేము అధ్యయనం చేస్తాము. భారత ప్రభుత్వం తన జాతీయ భద్రత, ప్రయోజనాలను పరిరక్షించడానికి పూర్తిగా కట్టుబడి ఉందని జైస్వాల్ స్పష్టం చేశారు. ఈ ఒప్పందం వార్తల తర్వాత భారతదేశం దీనిని సీరియస్‌గా తీసుకుంది. దానిలోని ప్రతి అంశాన్ని పరిశీలిస్తుంది.
సౌదీ అరేబియా, పాకిస్తాన్ మధ్య ఈ కొత్త ఒప్పందం అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్న క్రమంలో.. ఈ ఒప్పందం తన ప్రయోజనాలకు విరుద్ధం కాదా అన్న విషయంపైనే భారత్ దృష్టి కేంద్రీకరించింది. దీంతో పాటు ప్రతి ప్రాంతంలోనూ తమ భద్రతను పటిష్టంగా ఉంచుకుంటామని భారత్ స్పష్టం చేసింది. ఈ ఒప్పందంపై ప్రభుత్వం లోతైన అధ్యయనం చేస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.