ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తన కోవిడ్ వెబ్ సైట్లో భారత్ చిత్రపటాన్ని తప్పుగా చూపించడంతో కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ భారతదేశం అంతర్భాగమైన జమ్మూ కశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్‌లను ప్రపంచ పటంలో పాకిస్తాన్, చైనాలో భాగంగా చూపింది. ఈ విషయాన్ని తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) నాయకుడు శాంతను సేన్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. COVID-19 సైట్‌ను తెరిచినప్పుడు, భారతదేశ మ్యాప్‌ను చూశాను, అందులో జమ్మూ కశ్మీర్ వేరే రంగును కలిగి ఉందని ఆయన చెప్పుకొచ్చారు. దానిలో చిన్న భాగం కూడా భిన్నంగా ఉంటుంది. జూమ్ చేసి వాటిపై క్లిక్ చేసినప్పుడు, పాకిస్తాన్, చైనా దేశాలపై కోవిడ్ గణాంకాలు కనిపించాయని అన్నారు.
పాక్ లోని కోవిడ్ డేటాను, అరుణాచల్ ప్రదేశ్‌లోని కొంత భాగాన్ని భారత్‌తో పాటు చైనాలో కూడా భాగంగా చూపించాయని శాంతను సేన్ చెప్పారు. రాజ్యసభలో ఓ ప్రశ్నకు కేంద్ర విదేశీ వ్యవహారాల సహాయమంత్రి వి.మురళీధరన్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. డబ్ల్యూహెచ్ఓ వెబ్ సైట్లో భారత మ్యాప్ అగ్రభాగాన ఉండే జమ్మూ కశ్మీర్, లడఖ్ భూభాగాలను విడిగా చూపించడం పట్ల కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేశామన్నారు. జమ్మూ కశ్మీర్ భూభాగాన్ని తప్పుగా చిత్రీకరించడంపై డబ్ల్యూహెచ్ఓను అత్యున్నతస్థాయి మార్గాల ద్వారా వివరణ కోరామని, తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశామని మురళీధరన్ అన్నారు. దీనిపై డబ్ల్యూహెచ్ఓ ఐరాసలోని భారత శాశ్వత మిషన్ వర్గాలకు సమాచారం అందించిందని మురళీధరన్ వెల్లడించారు.