రష్యా నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న ముడి చమురు దిగుమతులను రెట్టింపు చేసేందుకు సిద్ధమైంది భారత్. దీనికోసం ప్రభుత్వ రంగ చమురు సంస్థలతో చర్చలు జరుపుతోంది. రానున్న ఆరు నెలల పాటు ముడి చమురు సరఫరా కోసం ఒప్పందం చేసుకునేందుకు దేశీయ చమురు సంస్థలు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయి. రష్యా ప్రభుత్వ సంస్థ రాస్‌నెఫ్ట్‌తో చర్చలు మొదలుపెట్టింది భారత్. ఇదివరకు చేసుకున్న ఒప్పందాలకు ఇవి అదనంగా జరగనున్నాయని, ధరతో పాటు ఎంత పరిమాణం అనే అంశాలపై చర్చలు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. దిగుమతుల పరిమాణం, ధరలపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు.
ఈ సరఫరాలు అన్నింటికీ ఆర్థికసాయం చేసే భారత బ్యాంకులతో చర్చలు జరుగుతున్నాయి. ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించాక, రష్యా చమురు దిగుమతులపై అమెరికా, ఐరోపా దేశాలు ఆంక్షలు విధించాయి. దీన్ని భారత్ అనుకూలంగా మలచుకుని, రష్యా నుంచి చౌకగా ముడిచమురును కొనుగోలు చేస్తోంది. రాస్‌నెఫ్ట్ లాంటి రష్యా కంపెనీల నుంచి నేరుగా చమురును దిగుమతి చేసుకునేందుకు ప్రభుత్వ రంగ రిఫైనరీలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్‌తో పాటు ప్రైవేటు సంస్థలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, నయర ఎనర్జీ కూడా ఆసక్తి కనబరుస్తూ ఉన్నాయి. ఇదే జరిగితే భారత్ లో పెట్రోల్-డీజిల్ ధరలు భారత్ లో మరింత తగ్గే అవకాశం ఉంది.