చైనా పౌరులను భారత్ విమానాల్లోకి అనుమతించరా..?
India Bans Chinese Citizens Travel On Its Airlines. భారత్-చైనా దేశాల మధ్య ఇటీవలి కాలంలో చోటు చేసుకుంటున్
By Medi Samrat Published on 28 Dec 2020 4:39 PM ISTభారత్-చైనా దేశాల మధ్య ఇటీవలి కాలంలో చోటు చేసుకుంటున్న ఘటనల గురించి తెలిసిందే..! భారత్ ను ఇబ్బందులు పెట్టాలని చైనా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. చైనాకు భారత్ ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇచ్చింది. ఇటీవల చైనాలోని వివిధ ఓడరేవులలో భారతీయులు చిక్కుకున్నప్పుడు, వారిని తమ తీరంలో దిగడానికి చైనా ప్రభుత్వం నిరాకరించింది. అంతర్జాతీయ వాణిజ్య ఓడల్లో పనిచేస్తున్న దాదాపు 1,500 మంది భారతీయ సిబ్బంది స్వదేశానికి చేరుకోలేకపోయారు. చైనా పాల్పడుతున్న చర్యలకు ధీటుగా సమాధానం చెప్పాలని భారత్ తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది.
చైనా పౌరుల విషయంలో భారత్ కొన్ని సూచనలను చేసినట్లు తెలుస్తోంది. చైనా పౌరులను భారత్ విమానాల్లోకి అనుమతించవద్దని అన్ని విమానయాన సంస్థలను కేంద్రం అనధికారికంగా కోరింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనధికారిక ఆదేశాన్ని అందుకున్నట్లు విమానయాన వర్గాలు ధృవీకరించాయి. కరోనా లాక్‌డౌన్ తర్వాత అంతర్జాతీయ విమాన ప్రయాణాల కోసం పలు దేశాలతో భారత్ 2 ఎయిర్ బబూల్స్ తెరచడంతో ఆ దేశాల్లో నివసించే చైనా పౌరులు వ్యాపార, ఉద్యోగ పనుల కోసం భారత్ రావడానికి అవకాశం ఏర్పడింది. చైనా పౌరులు భారతదేశంతో ఎయిర్ బబుల్ ఉన్న దేశాల ద్వారా పర్యాటక వీసాలను మినహాయించి నిర్దిష్ట రకాల వీసాలపై భారత్ కు రాకపోకలను కొనసాగిస్తున్నారు.
నవంబర్ నుంచి భారత పౌరులను తమ దేశంలోకి ప్రవేశించకుండా చైనా కూడా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా భారత్ సహా విదేశీ పౌరులకు వీసాలను నిలిపివేస్తూ అప్పటికే మంజూరు చేసిన వాటిని రద్దుచేసింది. చైనా పౌరులు తమ విమానాల్లో భారత్‌లోకి ప్రయాణించవద్దని గతవారం రోజులుగా స్వదేశీ, విదేశీ విమానయాన సంస్థలు చెబుతున్నాయి. టూరిస్ట్ వీసాలను తాత్కాలికంగా రద్దు చేశారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం భారత్‌కు టిక్కెట్లు బుక్ చేసుకున్న చైనా పౌరులకు బోర్డింగ్ నిరాకరించడానికి కారణం చెప్పడానికి తమకు లిఖితపూర్వకంగా ఏదో ఒక ఉత్తర్వులు ఇవ్వాలని కొన్ని విమానయాన సంస్థలు అధికారులను కోరుతున్నాయి. భారత్ మాత్రం చైనీయులను అనుమతించే అవకాశాలు లేవని అనధికారంగా తేల్చి చెబుతోంది.