రష్యాకు వ్యతిరేకంగా ఐరాసా భద్రతా మండలిలో తీర్మానం.. ఓటింగ్‌కు దూరంగా ఉన్న భారత్
India abstains on UNSC resolution that condemns Russia's 'aggression' against Ukraine. ఉక్రెయిన్ పై రష్యా సేనలు
By తోట వంశీ కుమార్ Published on 26 Feb 2022 4:01 AM GMTఉక్రెయిన్ పై రష్యా సేనలు విరుచుకుపడుతున్నాయి. రష్యాను కంట్రోల్ చేసేందుకు అమెరికాతో పాటు పలు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమైంది. ఉక్రెయిన్ పై రష్యా దాడిని ఖండిస్తూ భద్రతా మండలిలో ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మండలిలోని మొత్తం 15 సభ్య దేశాల్లో 11 దేశాలు రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేశాయి. అయితే.. శాశ్వత సభ్యదేశమైన రష్యా తన విటో అధికారాన్ని ఉపయోగించి తీర్మానాన్ని వీగిపోయేలా చేసింది.
ఇక ఉక్రెయిన్-రష్యా వివాదంపై మొదటి నుంచి తటస్థంగా ఉన్న భారత్‌తో పాటు చైనా, యూఏఈలు ఈ ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి. మరోవైపు 193 సభ్య దేశాలు ఉన్న ఐరాస జనరల్ అసెంబ్లీలో ఈ ముసాదాను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. భద్రతా మండలిలో తనకు ఉన్న విటో అధికారంతో అడ్డుకున్నప్పటికీ.. ఆ దేశాన్ని అంతర్జాతీయంగా ఒంటరిగా చేశామని పశ్చిమదేశాలు బావిస్తున్నాయి.
ఓటింగ్ అనంతరం ఐరాసలో యూఎస్ రాయబారి లిండా థామస్ గ్రీన్‌ఫీల్డ్ మాట్లాడుతూ.. ఈ తీర్మానాన్ని మీరు విటో చేసి ఉండవచ్చు. అయితే.. మా గొంతులను మీరు విటో చేయలేరు. నిజాన్ని మీరు విటో చేయలేరు. మా విలువలను విటో చేయలేరు. ఉక్రెయిన్ ప్రజలను విటో చేయలేరని రష్యాను ఉద్దేశించి అన్నారు.
ఐరాసలో భారతరాయబారి టీఎస్ తిరుమూర్తి మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌లో ఇటీవల జరుగుతున్న పరిణామాల పట్ల భారత్ తీవ్ర ఆందోళనకు గురవుతుందని తెలిపారు. హింసను తక్షణమే నిలిపివేయడానికి తగిన ప్రయత్నాలు చేయాలని కోరారు. మానవాళి ప్రాణాలను పణంగాపెట్టడం వల్ల ఎలాంటి పరిష్కారం లభించదని చెప్పారు.
అంతకముందు.. ఐక్యరాజ్య సమితి ప్రవేశపెట్టిన తీర్మానం విషయంలో తమకు భారత మద్దతు ఇస్తుందని ఆశిస్తున్నట్లు రష్యా వెల్లడించింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, అందుకు దారితీసిన కారణాలను అర్థం చేసుకున్నందుకు అభినందనలు తెలిపింది.