'న్యాయమూర్తులు దేశద్రోహులు.. సిగ్గుపడాలి'.. పాక్‌ న్యాయవ్యవస్థపై ఇమ్రాన్ తీవ్ర వ్యాఖ్య‌లు

గత కొన్ని రోజులుగా పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

By -  Medi Samrat
Published on : 23 March 2026 12:30 PM IST

న్యాయమూర్తులు దేశద్రోహులు.. సిగ్గుపడాలి.. పాక్‌ న్యాయవ్యవస్థపై ఇమ్రాన్ తీవ్ర వ్యాఖ్య‌లు

గత కొన్ని రోజులుగా పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ కుమారుడు ఖాసిం ఖాన్ రావల్పిండిలోని ఆదియాలా జైలులో తన తండ్రిని పరామర్శించారు. ఈ భేటీ అనంతరం ఖాసిం తన తండ్రి పంపిన ఒక సందేశాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ సందేశంలో ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ న్యాయవ్యవస్థ, ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.

తన కుమారుడి ద్వారా పంపిన సందేశంలో ఇమ్రాన్ ఖాన్.. "దేశ న్యాయమూర్తులు సిగ్గుపడాలి" అని అన్నారు. న్యాయవ్యవస్థ తన ఆత్మను అమ్ముకుందని, దేశ ఐక్యత పట్ల దానికి ఏమాత్రం శ్రద్ధ లేదని ఆయన ఆరోపించారు. తన ప్రత్యర్థులు తనను మానసికంగా దెబ్బతీయడంలో విఫలమైనప్పుడు, వారు తన భార్య బుష్రా బీబీని లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించారు. బుష్రా బీబీ పట్ల వ్యవహరించిన తీరు అమానుషమైనదని, ఇస్లాంకు వ్యతిరేకమని ఆయన అభివర్ణించారు. ఇదంతా తనను బ్లాక్‌మెయిల్ చేయడానికి పన్నిన కుట్ర అని ఇమ్రాన్ అన్నారు.

జైలు కష్టాలను వివరిస్తూ ఇమ్రాన్ ఖాన్.. తన కుమారులను 30 నిమిషాలు క‌లిసినా.. 24 గంటల పాటు ఏకాంతవాసంలో గడపాల్సి వస్తోందని అన్నారు. సమాజానికి న్యాయం అందించాల్సిన వారే ద్రోహం చేస్తున్నారని, న్యాయమూర్తులు దేశద్రోహులని ఆయన అన్నారు. వారు సిగ్గుపడాలని అన్నారు.

ఇమ్రాన్ ఖాన్ ఇద్దరు కుమారులు సులేమాన్, ఖాసిం లండన్‌లో నివసిస్తున్నారు. తమ తండ్రి కుడి కంటి చూపు గణనీయంగా క్షీణించిందని, ఆయన చికిత్స విషయంలో జైలు యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని వారు గతంలో ఆరోపించారు. రాయిటర్స్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఇమ్రాన్ ఖాన్‌పై ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుందనే భయంతో ప్రభుత్వం తనకు పాకిస్థాన్ పర్యటనకు వీసాను నిరాకరిస్తోందని ఖాసిం పేర్కొన్నారు. అయితే, ఆ తర్వాత వారికి వీసా మంజూరైంది.

కొన్ని రోజుల క్రితం ఇమ్రాన్ ఖాన్‌ను చికిత్స కోసం ఆసుపత్రికి పంపాలని కోరుతూ ఆయన న్యాయవాది లతీఫ్ ఖోసా కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. గత ఏడాది అక్టోబర్ నుంచి ఇమ్రాన్ కంటి సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, చికిత్స తర్వాత ఆయన కంటిచూపు మెరుగుపడిందని ప్రభుత్వం చెబుతోంది. 72 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్ ఒక అవినీతి కేసులో 2023 ఆగస్టు నుంచి జైలులో ఉన్నారు.

Next Story