రష్యాలో హర్యానాకు చెందిన 22 ఏళ్ల యువకుడు మరణించాడు. రవి మౌన్ మృతిని మాస్కోలోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించిందని మృతుడి కుటుంబీకులు పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై ఫ్రంట్‌లైన్‌లో పోరాడేందుకు రష్యా ఆర్మీ తనను పంపిందని మృతుడి సోదరుడు అజయ్ మౌన్ ఆరోపించారు.
రవి మౌన్ హర్యానాలోని కైతాల్ జిల్లాలోని మాటౌర్ గ్రామ నివాసి. రవి జనవరి 13న రవాణా ఉద్యోగం కోసం రష్యా వెళ్లాడని అతని సోదరుడు పేర్కొన్నాడు. కానీ రవిని సైన్యంలో చేర్చారు. అజయ్ మౌన్ తన సోదరుడు రవి ఆచూకీ గురించి సమాచారం ఇవ్వాలని కోరుతూ.. జూలై 21న రాయబార కార్యాలయానికి లేఖ రాశాడు. అయితే.. అతడు చనిపోయాడని రాయబార కార్యాలయం మాకు చెప్పిందని అజయ్ మౌన్ చెప్పాడు. మృతదేహాన్ని గుర్తించేందుకు డీఎన్‌ఏ పరీక్ష నివేదికను పంపాల్సిందిగా ఎంబసీ కోరినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తన సోదరుడు జనవరి 13న రష్యా వెళ్లాడని అజయ్ మౌన్ తెలిపాడు. ఒక ఏజెంట్ అతడిని రవాణా ఉద్యోగం నిమిత్తం రష్యాకు పంపాడు. అయితే.. అతడు రష్యన్ సైన్యంలోకి డ్రాఫ్ట్ చేయబడ్డాడని పేర్కొన్నాడు.
ఉక్రెయిన్ బలగాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు ముందు వరుసలోకి వెళ్లాలని.. లేదంటే 10 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాలని రష్యా బలగాలు తన సోదరుడిపై ఒత్తిడి తెచ్చాయని మృతుడి సోదరుడు ఆరోపించారు. కందకాలు తవ్వడంలో శిక్షణ ఇచ్చారని.. ఆ తర్వాత ముందు వరుసలోకి పంపారని అజయ్ మౌన్ తెలిపారు. మార్చి 12 వరకు అతడితో టచ్‌లో ఉన్నామని.. చాలా బాధగా ఉందన్నారు. అజయ్ మౌన్ లేఖపై భారత రాయబార కార్యాలయం ప్రతిస్పందన ప్రకారం.. రవి మౌన్ మరణాన్ని రష్యా ధృవీకరించింది. అయితే, మృతదేహాన్ని గుర్తించడానికి వారు అతడి దగ్గరి బంధువుల ద్వారా DNA పరీక్ష చేయవలసి ఉంటుంది. అజయ్ మౌన్ తన సోదరుడి మృతదేహాన్ని భారతదేశానికి తీసుకురావాలని ప్రధాని నరేంద్ర మోదీని అభ్యర్థించారు.