టర్కీ-సిరియాలో సంభవించిన భూకంపం కారణంగా 4,800 మందికి పైగా మరణించారు. ఈ భూకంపంలో ప్రముఖ ఫుట్‌బాల్ ఆటగాడు మరణించాడని కథనాలు వచ్చాయి. అయితే అతడు బతికే ఉన్నాడని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. శిథిలాలలో ఘనా జాతీయ ఆటగాడు, మాజీ న్యూకాజిల్ మిడ్‌ఫీల్డర్ క్రిస్టియన్ అట్సు సజీవంగా ఉన్నట్లు టర్కీలోని ఘనా రాయబారి తెలిపారు. అట్సు సెప్టెంబరులో టర్కిష్ సూపర్ లీగ్ లోని Hatayspor జట్టులో చేరారు. దక్షిణ ప్రావిన్స్ హటేలో అతడు బతికే ఉన్నాడనే విషయం ప్రపంచానికి తెలిసింది. "నాకు ఓ గుడ్ న్యూస్ తెలిసింది. క్రిస్టియన్ అట్సు హటేలో కనుగొన్నాడని ఘనా అసోసియేషన్ ప్రెసిడెంట్ నుండి సమాచారం అందింది" అని టర్కీలోని ఘనా రాయబారి తెలిపారు. అతని పరిస్థితిపై రాయబారి మరిన్ని వివరాలు ఇవ్వలేదు.
టర్కీ-సిరియాల్లో భూకంపాల కారణంగా మరణాల సంఖ్య 4,300 కంటే ఎక్కువగా ఉంది. 7.8-మాగ్నిట్యూడ్‌తో వచ్చిన భూకంపం ధాటికి అనేక నగరాల్లో 6000 కంటే ఎక్కువ భవనాలు కూలిపోయాయి. శిథిలాల కింద చిక్కుకున్న వందలాది మందిని రక్షించేందుకు రెస్క్యూ కార్యక్రమాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. భూకంపం తర్వాత దాదాపు 100కి పైగా శక్తిమంతమైన ప్రకంపనలు టర్కీ, సిరియాలను కుదిపేశాయి. ఎప్పుడు ఎలాంటి ముప్పు ముంచుకొస్తుందో తెలియక జనం రోడ్లపైనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.