అమెరికాలో మండిపోతున్న గుడ్ల ధరలు
డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత ఇతర దేశాలపై సుంకాలపై సుంకాలు విధిస్తున్నారు.
By Medi Samrat
డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత ఇతర దేశాలపై సుంకాలపై సుంకాలు విధిస్తున్నారు. భారత్ సహా పలు దేశాలపై పరస్పరం సుంకాలు విధించాలని నిర్ణయించిన డొనాల్డ్ ట్రంప్ కు కోడి గుడ్డు తలనొప్పిని పెంచింది. అవును! ప్రపంచ సమస్యలను పరిష్కరిస్తామని చెబుతున్న అమెరికా పాలనా యంత్రాంగం దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న గుడ్ల ధరలతో కలవరపడుతోంది.
అమెరికాలో గుడ్ల ధర ఆకాశాన్నంటుతోంది. మెక్సికో, కెనడా వంటి దేశాల నుంచి కోడిగుడ్లను కూడా స్మగ్లింగ్ చేసేంత దారుణంగా తయారైంది పరిస్థితి. కొన్ని నగరాల్లో డజను కోడిగుడ్ల ధర 10 డాలర్లకు (దాదాపు రూ.870) చేరింది.
అమెరికాలో గుడ్డు ధరలు మండిపోడానికి కారణం వుంది. బర్డ్ ఫ్లూ H5N1, ఏవియన్ ఇన్ఫ్లుఎంజా మహమ్మారి కారణంగా.. 2022 నుండి అమెరికాలో 15 కోట్లకు పైగా పక్షులు చనిపోయాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో 1.9 కోట్ల కోళ్లు చనిపోయాయి. ఫలితంగా గుడ్ల సరఫరా తగ్గిపోయింది.
ప్రస్తుతం అమెరికా సలు యూరప్ దేశాల నుంచి గుడ్లను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతోంది. టర్కీ, దక్షిణ కొరియాల నుంచి కోడిగుడ్లు కొనుగోలు చేయాలనే కోరికను అమెరికా కూడా వ్యక్తం చేసింది. అతిపెద్ద ఆందోళన ఏమిటంటే.. అధ్యక్షుడు ట్రంప్ దేశాలపై సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. దీని కారణంగా గుడ్లు కొనడం అమెరికాకు అంత సులభం కాదు. అదే సమయంలో ఇతర దేశాల నుండి అమెరికాకు గుడ్లు సరిగ్గా తీసుకురావడం సవాలుతో కూడిన పని.