మరో సంచలన నిర్ణయం.. 41 దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించనున్న ట్రంప్..!
టారిఫ్‌లతో కూడిన వాణిజ్య యుద్ధం తర్వాత.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు మరో అంశం ద్వారా ఎదురుదాడి చేసేందుకు సన్నాహాలు ప్రారంభించారు.
By Medi Samrat Published on 15 March 2025 9:32 AM IST
టారిఫ్‌లతో కూడిన వాణిజ్య యుద్ధం తర్వాత.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు మరో అంశం ద్వారా ఎదురుదాడి చేసేందుకు సన్నాహాలు ప్రారంభించారు. 41 దేశాలపై ప్రయాణ నిషేధం విధించేందుకు ఆయన ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఇందులో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, సిరియా మరియు ఇతర దేశాలు ఉన్నాయి.
వార్తా సంస్థ రాయిటర్స్ ప్రకారం.. ట్రంప్ ప్రభుత్వం 41 దేశాలతో కలిపి మొత్తం 3 జాబితాలను రూపొందించింది. మొదటి జాబితాలో 10 దేశాలు చేర్చగా.. ఇందులో ఆఫ్ఘనిస్తాన్, సిరియా, ఇరాన్, క్యూబా, ఉత్తర కొరియా వంటి దేశాలు ఉన్నాయి. ఈ దేశాల పౌరులు అమెరికా వెళ్లేందుకు అనుమతించరు. వీటన్నింటిపై పూర్తి నిషేధం ఉంటుంది.
రెండవ జాబితాలో తూర్పు ఆఫ్రికా దేశాలైన ఎరిట్రియా, హైతీ, లావోస్, మయన్మార్, దక్షిణ సూడాన్ పేర్లు ఉన్నాయి. ఈ దేశాల ప్రజలకు పాక్షిక సస్పెన్షన్ వర్తిస్తుంది. ఈ సస్పెన్షన్ కొన్ని మినహాయింపులతో.. పర్యాటక, విద్యార్థి వీసాలతో పాటు ఇతర వలస వీసాలపై ప్రభావం చూపుతుంది.
మరో 26 దేశాలను మూడో జాబితాలో చేర్చింది. జాబితాలోని అందరి పేర్లను వెల్లడించలేనప్పటికీ.. అందులో పాకిస్థాన్, భూటాన్, మయన్మార్ వంటి దేశాలు ఉన్నాయి. 60 రోజుల్లోగా లోపాలను తొలగించేందుకు అక్కడి ప్రభుత్వాలు ప్రయత్నాలు చేయకుంటే వారికి అమెరికా వీసాలు జారీ చేయడంపై పాక్షిక నిషేధం విధించే అవకాశం ఉంది.
అయితే మూడవ జాబితా చివరిది కాదు.. దానికి కొన్ని దేశాల పేర్లు జోడించే లేదా తీసివేసే అవకాశం ఉంది. ఈ జాబితాపై ట్రంప్ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. డొనాల్డ్ ట్రంప్ తన మొదటి పదవీ కాలంలో కూడా 7 ముస్లిం దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించారు.
ప్రస్తుతం ట్రంప్ తన రెండో టర్మ్‌లోనూ దీన్ని కొనసాగించేందుకు సిద్ధమయ్యారు. ఇమ్మిగ్రేషన్‌పై కఠినంగా వ్యవహరిస్తూ.. ఆయా దేశాల టెస్టింగ్, స్క్రీనింగ్ సమాచారం చాలా తక్కువగా ఉన్నందున ప్రయాణాన్ని పాక్షికంగా లేదా పూర్తిగా నిలిపివేయవలసిన దేశాల జాబితాను మార్చి 21 లోపు సమర్పించాలని క్యాబినెట్ సభ్యులను ట్రంప్ ఆదేశించారు.