భారీ భూకంపం ధాటికి ఇండోనేషియా కుదేలయ్యింది. ప్రధాన ద్వీపం పశ్చిమ జావా ప్రావిన్స్‌లో సోమవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 5.6గా నమోదైంది. ఈ భూకంపం దాటికి దాదాపు 29 మంది మరణించగా, వందల్లో గాయపడ్డారని అధికారులు తెలిపారు. భూ ప్రకంపనలతో పట్టణంలోని పలు నివాసాలు నేలకూలాయని, మరికొందరు భవనాల శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని అధికారులు భావిస్తూ ఉన్నారు.
మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉందని చెబుతూ ఉన్నారు. ఇండోనేషియా రాజధాని జకార్తాలో సోమవారం కొన్ని సెకన్ల పాటు 5.6 తీవ్రతతో భూకంపం సంభవించిందని వాతావరణ, జియోఫిజిక్స్ ఏజెన్సీ (బీఎంకేజీ) తెలిపింది. భూకంప కేంద్రం పశ్చిమ జావాలోని సియాంజార్ లో జకార్తాకు ఆగ్నేయంగా 75కి.మీ దూరంలో ఉంది. 10 కి.మీ (6.2మైళ్లు) లోతులో సునామీ వచ్చే అవకాశం లేదని బీఎంకేజీ తెలిపింది. భూకంపాలకు ఇళ్లు, భవనాలు ధ్వంసం అయ్యాయి. భయంతో జనాలు రోడ్లపైకి చేరారు.