ప్రధాని మోదీకి చైనా ఆహ్వానం

2020లో గల్వాన్ లోయలో జరిగిన హింసాత్మక ఘర్షణల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారిగా చైనాలో పర్యటించనున్నారు.

By Medi Samrat
Published on : 8 Aug 2025 5:38 PM IST

ప్రధాని మోదీకి చైనా ఆహ్వానం

2020లో గల్వాన్ లోయలో జరిగిన హింసాత్మక ఘర్షణల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారిగా చైనాలో పర్యటించనున్నారు. ఆగష్టు నెలాఖరులో టియాంజిన్ నగరంలో జరగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనబోతున్నారు. ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతున్నట్లు చైనా శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఈ ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో టియాంజిన్‌లో ఎస్సీఓ సదస్సు జరగనుంది. ఈ సమావేశానికి భారత ప్రధాని మోదీ వస్తున్న విషయాన్ని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గువో జియాకున్ బీజింగ్‌లో జరిగిన మీడియా సమావేశంలో ధృవీకరించారు. భారత్, చైనా, రష్యా, పాకిస్థాన్ సహా మొత్తం పది దేశాలు సభ్యులుగా ఉన్న ఎస్సీఓను 2001లో స్థాపించారు. ఈసారి టియాంజిన్‌లో జరిగే సదస్సు, సంస్థ చరిత్రలోనే అతిపెద్దదిగా నిలవనుందని చైనా వెల్లడించింది. సుమారు 20 దేశాల నేతలు, 10 అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమాలలో పాల్గొననున్నారు.

2019 తర్వాత మోదీ చైనాలో పర్యటించడం ఇదే ప్రథమం. గల్వాన్ ఘర్షణల అనంతరం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి పలు అంశాలపై ఇరు దేశాల మధ్య ఒక అంగీకారం కుదరడంతో ప్రతిష్టంభన వీడింది. ఈ సానుకూల వాతావరణంలోనే ప్రధాని మోదీ పర్యటన ఖరారైంది.

Next Story