రేపు టెస్లా కారు కొంటున్నాను : ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెస్లా ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయనున్నారు.
By Medi Samrat
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెస్లా ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్‌లో తెలిపారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అధ్యక్షుడు ట్రంప్ ఇలా వ్రాశారు, "ఎలోన్ మస్క్ మన దేశానికి సహాయం చేయడానికి తన ప్రాణాలను పణంగా పెడుతున్నారు. అతడు అద్భుతమైన పని చేస్తున్నాడు! కానీ రాడికల్ వామపక్షాలు అతనికి హాని కలిగించడానికి ఎలోన్ మస్క్ కంపెనీ టెస్లాను బహిష్కరిస్తున్నాయి. 2024 ఎన్నికల్లో నన్ను ఆపాలని ప్రయత్నించారు కానీ అది కుదరలేదు. ఏది జరిగినా, నిజమైన గొప్ప అమెరికన్ అయిన ఎలోన్ మస్క్‌కి నా విశ్వాసం.. మద్దతును తెలియజేయడానికి నేను రేపు ఉదయం కొత్త టెస్లాను కొనుగోలు చేయబోతున్నాను అని పేర్కొన్నారు.
అమెరికాను మళ్లీ గొప్పగా మార్చేందుకై.. తన అపారమైన నైపుణ్యాలను ఉపయోగించుకునే పనిలో పెట్టుకున్నందుకు అతన్ని (ఎలోన్ మస్క్) ఎందుకు శిక్షించాలని ట్రంప్ ప్రశ్నించారు.
ప్రభుత్వ సంస్థల వృధా వ్యయాలను అరికట్టడానికి, అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వ సమర్థత విభాగాన్ని అంటే DOGEని స్థాపించారు. దానికి ఎలోన్ మస్క్‌ని అధిపతిగా చేశారు. ప్రభుత్వ ధనాన్ని వృధాగా ఖర్చు చేయడాన్ని ఎలా అరికట్టాలనే దానిపై ప్రభుత్వ సమర్థత విభాగం అధికారులు ట్రంప్ ప్రభుత్వానికి సలహా ఇస్తున్నారు.
అమెరికాలో తొలగింపులకు వ్యతిరేకంగా ఉదారవాద గ్రూపులు ఎలోన్ మస్క్‌ను నిరంతరం వ్యతిరేకిస్తున్నాయి. కొన్ని వారాలుగా ఈ సమూహాలు టెస్లాకు వ్యతిరేకంగా కార్ల కంపెనీ అమ్మకాలను ప్రతికూలంగా ప్రభావితం చేసే ప్రయత్నంలో.. డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE)పై వ్యతిరేకతను తీవ్రతరం చేసే ప్రయత్నంలో ఉన్నాయి.
'బర్న్ ఎ టెస్లా: సేవ్ డెమోక్రసీ' అనే ప్రచారం కూడా జరుగుతోంది. కొన్ని రోజుల క్రితం, న్యూయార్క్ నగరంలోని టెస్లా వెలుపల హింసాత్మక ప్రదర్శనకు సంబంధించి 9 మందిని అరెస్టు చేశారు. వందలాది మంది నిరసనలో పాల్గొన్నారని పోలీసులు తెలిపారు.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE) అధిపతి ఎలోన్ మస్క్.. ట్రంప్ పరిపాలన ఖర్చుల కోతలకు పెద్ద మద్దతుదారు. అయితే, ఇప్పుడు ట్రంప్ పరిపాలన అధికారులు ఎలాన్ మస్క్ నిర్ణయాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇటీవల, సిబ్బంది తగ్గింపు అంశంపై ఉన్నత స్థాయి సమావేశంలో విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ఎలాన్ మస్క్ మధ్య వాగ్వాదం జరిగింది.
రూబియో తన డిపార్ట్‌మెంట్‌లో తగినంత లేఆఫ్‌లు చేయలేదని మస్క్ ఆరోపించారు. రూబియో కూడా మస్క్‌కు బదులిచ్చాడు. ఇప్పటికే తన డిపార్ట్‌మెంట్ నుండి 1500 మంది ఉద్యోగులు సొంతంగా రిటైర్మెంట్ తీసుకున్నారని చెప్పాడు.