పంజాబ్‌లోని భారత్-పాక్ సరిహద్దులో అక్రమంగా తరలిస్తున్న ఆయుధాలను పెద్ద ఎత్తున బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్).. పంజాబ్ పోలీస్ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం బుధవారం తార్న్ తారన్ జిల్లాలోని ఖేమ్‌కరన్‌లో పాక్ సరిహద్దుల నుంచి ఆయుధాలను చేసుకుంది. మొత్తం 22 విదేశీ తుపాకులు, 100 రౌండ్ల మందుగుండు, 44 మ్యాగజైన్లు, కిలో హెరాయిన్, 72 గ్రాముల ఓపియంను స్వాధీనం చేసుకున్నారు. జీరో లైన్ వద్ద సంచిలో ఈ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. భారత్ భూభాగంలోకి ఆయుధాలు సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. బీఎస్‌ఎఫ్‌తో కలిసి పంజాబ్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. ఆయుధాలను డ్రోన్ల ద్వారా స్మగ్లింగ్ చేసి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
పాకిస్తాన్, బంగ్లాదేశ్‌తో అంతర్జాతీయ సరిహద్దులను పంచుకుంటున్న బీఎస్ఎఫ్ అధికార పరిధిని 50 కిలోమీటర్లకు ఇటీవలే పెంచుతూ కేంద్ర నిర్ణయం తీసుకుంది. పాక్, బంగ్లాదేశ్‌తో అంతర్జాతీయ సరిహద్దు నుంచి ఆయా రాష్ట్రాల్లోని 50 కిలోమీటర్ల పరిధి వరకు తనిఖీలు, అనుమానితుల అరెస్ట్, వస్తువులను స్వాధీనం చేసుకునే అధికారాన్ని కల్పించింది. పాక్, బంగ్లాదేశ్‌తో సరిహద్దులు కలిగిన పంజాబ్, పశ్చిమ్ బెంగాల్, అసోంలో ఇప్పటి వరకు బీఎస్‌ఎఫ్‌కు అధికార ప్రాంత పరిధి 15 కిలోమీటర్లు మాత్రమే ఉండేంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా దీనిని 50 కిలోమీటర్లకు పొడిగించింది.