పాకిస్తాన్‌లోని వజీరిస్తాన్ ప్రాంతంలో శుక్రవారం ప్రార్థనల సమయంలో ఒక మసీదులో జరిగిన పేలుడులో స్థానిక ఇస్లామిక్ నాయకుడు, పిల్లలు సహా ముగ్గురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. దేశంలోని వాయువ్య ప్రాంతంలోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లోని జామియత్ ఉలేమా ఇస్లాం-ఫజల్ (జెయుఐ-ఎఫ్) రాజకీయ పార్టీ నాయకుడు అబ్దుల్లా నదీమ్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ పేలుడు జరిగిందని అధికారులు భావిస్తున్నారు.
నదీమ్ ఆసుపత్రిలో చేరాడు. స్థానిక మీడియా ప్రకారం.. అతని పరిస్థితి విషమంగా ఉంది. మౌలానా అబ్దుల్ అజీజ్ మసీదులో జరిగిన పేలుడులో గాయపడిన వారిలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని దక్షిణ వజీరిస్తాన్ జిల్లా పోలీసు చీఫ్ తెలిపారు. పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఈ పేలుడుకు ఎవరు బాధ్యులో ఇంకా స్పష్టంగా తెలియలేదు.