అఫ్గానిస్తాన్ మరోసారి రక్తసిక్తమైంది. దక్షిణ అఫ్తానిస్తాన్ లోని కాందహార్ నగరంలో షియాల మసీదులో బాంబు పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 37 మంది ప్రాణాలు కోల్పోగా.. 70 మందికి పైగా గాయాల పాలయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. శుక్రవారం ప్రార్థనలే లక్ష్యంగా ముష్కరులు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. కాందహార్‌లోని ఇమాన్ బార్గా మసీదులో ఈ పేలుడు సంభవించింది. విరిగిపోయిన కిటికీలు, చెల్లాచెదురుగా ఉన్న మృతదేహాలున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పేలుడు తీవ్రతకు గాయపడినవారికి మీర్ వాయిస్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఇదిలావుంటే.. గత శుక్రవారం కుందుజ్ నగరంలోని షియా మసీదుపై జరిగిన బాంబు దాడిలో 50 మందికిపైగా మరణించారు. అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా సేనలు వైదొలగిన తరువాత జరిగిన ఆ అతిపెద్ద దాడికి తామే కారణమని ఐసిస్ ప్రకటించుకుంది. తాలిబాన్లు ప్రభుత్వం ఏర్పాటుచేయడాన్ని వ్యతిరేకిస్తున్న ఐసిస్ అఫ్గానిస్తాన్‌లో దాడులకు పాల్పడుతుంది.