బంగ్లాదేశ్ లోని ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా శివారు ప్రాంతంలోని హషీమ్ ఫుడ్ ఫ్యాక్టరీలో జరిగిన ఈ అగ్నిప్రమాద ఘటనలో 52 మంది దుర్మరణం పాలయ్యారని అధికారులు తెలిపారు. రూప్ గంజ్ ప్రాంతంలోని ఆరు అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సిబ్బంది పెద్దసంఖ్యలో అందులో చిక్కుకుపోయారు. ఇప్పటివరకు 52 మృతదేహాలను వెలికితీశారు. అగ్ని ప్రమాదం సంభవించగానే చాలామంది కార్మికులు భవనం పై అంతస్తుల నుంచి కిందికి దూకి గాయాలపాలయ్యారు. 30 మంది క్షతగాత్రులను అధికారులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. పారిశ్రామిక సముదాయాల వద్ద వరుస విపత్తులు జరుగుతున్నా కూడా బంగ్లాదేశ్ అధికారుల్లో మార్పు రావడం లేదని తీవ్ర విమర్శలు వస్తూ ఉన్నాయి. గత 24 గంటలుగా ఫ్యాక్టరీలో అగ్ని మండుతూనే ఉందని.. అయినా అదుపు చేయలేకపోయారని అంటున్నారు.
సాధారణంగా ఈ ఫ్యాక్టరీలో 1000 మందికి పైగా పని చేస్తూ ఉండే వారు. గురువారం మంటలు వ్యాపించిన ఘటన గురించి తెలియగానే చాలా మంది రాలేదు. కానీ ఫైర్ ఫైటర్స్ ఫ్యాక్టరీ లోని మూడో ఫ్లోర్ లో చూడగా 49 మంది మరణించి ఉన్నారని తెలిసింది. అంతకు ముందే అధికారిక లెక్కల ప్రకారం ముగ్గురు చనిపోయి ఉండగా.. ప్రస్తుతానికి ఆ సంఖ్య 52కు చేరింది. మరింత మంది చనిపోయి ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తూ ఉన్నారు.