మాలి దేశంలో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. ఓ బస్సుపై మెరుపు దాడులు చేసి బీభత్సం సృష్టించారు. ఉగ్రవాదుల భీకర కాల్పుల్లో 32 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన బండియాగ్రా సమీపంలో జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బండియాగ్రాలోని ఓ మార్కెట్‌కు సోంగో విలేజ్‌కు చెందిన ప్రజలు వెళ్తున్నారు. ఆ బస్సు వారంలో రెండు రోజులు మాత్రమే అక్కడికి వెళ్తుంది. ఈ క్రమంలోనే నిన్న సోంగోతో పాటు స్థానిక గ్రామాలకు చెందిన మహిళలు మార్కెట్‌లో పని చేసేందుకు వెళ్తుండగా.. వారిని ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. రోడ్డుపై బస్సును ఆపి.. బస్సు డ్రైవర్‌ను హతమార్చారు. బస్సు టైర్లలో గాలి తీశారు. ఆ తర్వాత ప్రయాణికులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
పెట్రోల్ పోసి బస్సును తగులబెట్టి.. అక్కడి నుండి పారిపోయారు. ఈ ఉగ్రదాడి ఘటనలో 32 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన దృష్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బస్సు కాలిపోగా.. మృతదేహాలు చెల్లాచెదురుగా పడి అక్కడ భయంకరమైన వాతావరణం నెలకొంది. గత కొన్ని నెలలుగా మాలి దేశంలో ఉగ్రదాడులు పెరిగిపోతున్నాయి. అల్‌ఖైదా, ఇస్లామిక్ స్టేట్‌కు చెందిన ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. నార్త్ మాలిలో ఉగ్రదాడులు ఆగడం లేదు. ఇటీవల యూఎన్ కాన్వాయ్‌పై దాడి చేసిన ఘటనలో ఒకరు మృతి చెందగా, మరోకరు గాయపడ్డారు. మాలి దేశంలో ప్రభుత్వంపై ఆర్మీ తిరుగుబాట్లతో అక్కడి పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. ఈ ఏడాది మే నెలలోనే మాలిలో కొత్త గవర్నమెంట్ ఏర్పాటైంది. అయితే ఈ ఉగ్రదాడిపై ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.