ఆఫ్ఘనిస్థాన్ మసీదుపై భారీ ఉగ్ర దాడి.. 100 మంది మృతి
At least 100 dead, wounded in Afghan blast. ఆఫ్ఘనిస్థాన్ లోని ఈశాన్య ప్రాంత నగరం కుందుజ్ లో నేడు భారీ ఉగ్రదాడి జరిగింది.
By Medi Samrat Published on 8 Oct 2021 1:11 PM GMT
ఆఫ్ఘనిస్థాన్ లోని ఈశాన్య ప్రాంత నగరం కుందుజ్ లో నేడు భారీ ఉగ్రదాడి జరిగింది. ఓ మసీదులో జరిగిన ఈ పేలుడులో 100 మంది వరకు చనిపోయారు. పెద్ద సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. షియా ముస్లింలు మసీదులో ప్రార్థనలు జరుగుతుండగా ఈ ఘటన జరిగిందని తాలిబన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ వెల్లడించారు. దీనిపై తాలిబన్ల ప్రత్యేక బృందం ఘటనస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తుందని తెలిపారు. కుందుజ్ లోని ఆసుపత్రులకు తీసుకువస్తున్న క్షతగాత్రుల సంఖ్య అంతకంతకు పెరుగుతోందని ఓ వైద్యుడు తెలిపారు. కాగా ఈ దాడికి పాల్పడింది ఐసిస్-కె (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరాసన్)గా భావిస్తున్నారు. ఇటీవల షియా ముస్లిం వర్గానికి ఐసిస్-కె ఉగ్రవాద సంస్థ నుంచి పలు హెచ్చరికలు వచ్చినట్టు తెలుస్తోంది.
దాడి జరిగిన సమయంలో మసీదులో వందల మంది ముస్లింలు ప్రార్ధనలు చేస్తున్నారు. దాడి ఘటనలో క్షతగాత్రులతో కుందుజ్ సెంట్రల్ ఆస్పత్రి కిక్కిరిసిపోయింది. ఈ ఘటనలో తమ ఆస్పత్రికి ఇప్పటికి 35 మృతదేహాలు తీసుకువచ్చారని, 50 మంది గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఇక ఇతర ఆస్పత్రుల్లోనూ బాధితులు చికిత్స పొందుతున్నారు. మృతులు, క్షతగాత్రుల బంధువుల రోదనలతో కుందుజ్ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.