మధ్యప్రాచ్యంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యప్రాచ్యంలోని అన్ని గమ్యస్థానాలకు తమ విమాన సర్వీసులను తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. మధ్యప్రాచ్యంలోని కొన్ని ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మా ప్రయాణికులు, సిబ్బంది భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, అందుకే అన్ని విమానాలను నిలిపివేస్తున్నామని ఎయిర్ ఇండియా తెలిపింది. భద్రతా వాతావరణాన్ని నిరంతరం అంచనా వేస్తూ, అవసరమైన మేరకు మా ఆపరేషన్లను సర్దుబాటు చేస్తామని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రభావితమైన ప్రయాణికులకు తమ బృందాలు అన్ని విధాలా సహకరిస్తాయని హామీ ఇచ్చింది. ప్రయాణికులు తమ విమాన స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో లేదా 91 1169329333, 91 1169329999 నంబర్లకు కాల్ చేయడం ద్వారా 24 గంటల కాల్ సెంటర్‌ను సంప్రదించి తెలుసుకోవాలని సూచించింది. ఎయిర్ ఇండియాతో పాటు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కూడా తన సర్వీసులపై కీలక ప్రకటన చేసింది. గల్ఫ్ రీజియన్‌లోని పరిస్థితుల దృష్ట్యా పశ్చిమ దేశాలకు వెళ్లే అన్ని అంతర్జాతీయ విమానాలను రద్దు చేసినట్లు సంస్థ ప్రతినిధి తెలిపారు.