ఆఫ్ఘనిస్థాన్ లో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఆత్మాహుతి దాడిలో 30 మంది మరణించారు. ఘాజ్నీ నగర శివార్లలో ఓ కారులో పేలుడు పదార్థాలు నింపి ఈ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 30 మృతదేహాలను, 24 మంది క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకువచ్చారని, వారందరూ భద్రతా సిబ్బందేనని ఘాజ్నీ ఆసుపత్రి డైరెక్టర్ బాజ్ మహ్మద్ హెమత్ వెల్లడించారు. ఘాజ్నీ ప్రావిన్స్ లో తాలిబాన్ దళాలకు, ప్రభుత్వ బలగాలకు మధ్య కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు పేలుడు పదార్థాలతో నింపిన వాహనంతో ఈ దాడికి పాల్పడ్డాడని ఆఫ్ఘన్ హోంమంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు. ఈ దాడికి బాధ్యత తమదేనని ఏ తీవ్రవాద సంస్థ కూడా ప్రకటించలేదు.
కొద్ది రోజుల కిందటే ఆఫ్ఘనిస్థాన్ లోని బమియాన్ నగరంలో రెండు శక్తిమంతమైన పేలుళ్లు జరిగి 14 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఆఫ్ఘన్ సెక్యూరిటీ ఫోర్సెస్ లో ఓ విభాగమైన పబ్లిక్ ప్రొటెక్షన్ ఫోర్స్ మీద గత కొద్దిరోజులుగా టార్గెట్ చేస్తూ దాడులు చేస్తూ ఉన్నారు. కొద్దిరోజుల పాటూ ఆఫ్ఘనిస్థాన్ లో ప్రశాంతత ఉన్నట్లు కనిపించినా తిరిగి తీవ్రవాద చర్యలు ఎక్కువయ్యాయి. సైన్యం మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు కూడా ప్రాణాలను కోల్పోతూ ఉన్నారు. ఆఫ్ఘన్ లో మరోసారి అనిశ్చితి మొదలైంది.