ఆఫ్ఘనిస్తాన్ దేశంలోని మీడియా ఉద్యోగులు అత్యంత అధ్వాన్నమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. ఆఫ్ఘన్ జర్నలిస్ట్స్ ఫౌండేషన్ ప్రకారం.. జర్నలిస్టులు 79 శాతం మంది తమ ఉపాధిని కోల్పోయి.. డబ్బు సంపాదించడానికి, జీవన గమనానికి ఇతర వృత్తుల వైపు మొగ్గు చూపుతున్నారు. బలహీనమైన ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా.. ఫౌండేషన్ గత ఒకటిన్నర నెలల్లో ఆఫ్ఘన్ జర్నలిస్టుల జీవితాలను అంచనా వేసింది. జర్నలిస్టులు దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారని కనుగొన్నారు.
అధ్యయనం ప్రకారం.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆఫ్ఘనిస్తాన్ దేశంలో 75 శాతం మీడియా సంస్థలు మూసివేయబడ్డాయి. ఫౌండేషన్ యొక్క పరిశోధనల ప్రకారం.. 91 శాతం ఆఫ్ఘన్ జర్నలిస్టులుగా తమ కెరీర్ ఎంపిక పట్ల సంతృప్తితో ఉండగా.. 8 శాతం మంది మాత్రమే అసంతృప్తిగా ఉన్నారు. ఈ అధ్యయనంలో దేశవ్యాప్తంగా 462 మంది ఆఫ్ఘన్ జర్నలిస్టులు పాల్గొన్నారు. ఇందులో 390 మంది పురుషులు, 72 మంది మహిళలు ఉన్నారు. జర్నలిస్టుల ఆర్థిక పరిస్థితిలో జోక్యం చేసుకోవాలని ఫౌండేషన్ అంతర్జాతీయ సమాజాన్ని, ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వాన్ని కోరింది.