ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లో సోమవారం ఆత్మాహుతి దాడి జరిగింది. భారీ పేలుడు కారణంగా ఆరుగురు పౌరులు దుర్మరణం పాలయ్యారు, పలువురు గాయపడ్డారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఆప్ఘన్ విదేశాంగ కార్యాలయానికి సమీపంలో సెక్యూరిటీ చెక్‌పాయింట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. ఆత్మాహుతి బాంబర్ తన లక్ష్యం వైపు దూసుకువెళ్లుండగా మాలిక్ అష్ఘుర్ స్క్వేర్ వద్ద అతన్ని కాల్చిచంపామని, ఇదే సమయంలో అతను తనను తాను పేల్చేసుకున్నాడని కాబూల్ పోలీస్ ప్రతినిధి ఖలిద్ జడ్రాన్ తెలిపారు. ఈ పేలుడులో ముగ్గురు తాలిబన్ భద్రతా సిబ్బందితో సహా పలువురు గాయపడినట్టు చెప్పారు. చెక్‌పాయింట్ సమీపంలో విదేశాంగ శాఖ కార్యాలయంతో పాటు పలు ప్రభుత్వ భవంతులు ఉన్నాయి. అవే ఆత్మాహుతి బాంబర్ టార్గెట్ కావచ్చని భద్రతా సిబ్బంది అనుమానిస్తున్నారు. ఈ పేలుడుకు తామే బాధ్యులమని ఏ ఉగ్రవాద సంస్థ ఇంతవరకూ ప్రకటించ లేదు.
కాబూల్‌లోని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆఫీసు సమీపంలో మూడు నెలల్లోపు జరిగిన రెండవ దాడి. ఆఫ్ఘనిస్తాన్‌లో గురువారం ముస్లింల పవిత్ర మాసం రంజాన్ ప్రారంభమైన తర్వాత ఈ దాడి మొదటిది.