పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో శుక్రవారం మతపరమైన సమావేశంపై జరిగిన ఆత్మాహుతి దాడిలో 52 మంది మరణించారు. 50 మందికి పైగా గాయపడ్డారు. ముహమ్మద్ ప్రవక్త జయంతిని పురస్కరించుకుని బలూచిస్థాన్‌లోని మస్తుంగ్ జిల్లాలోని మసీదు సమీపంలో జరిగిన సమావేశంలో భారీ పేలుడు సంభవించింది. మస్తుంగ్ అసిస్టెంట్ కమీషనర్ అట్టా ఉల్ మునిమ్ పేలుడు తీవ్రత "భారీగా" ఉందని పేర్కొన్నారు. ఈ పేలుడులో మరణించిన వారిలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) నవాజ్ గష్కోరి కూడా ఉన్నారు. ఆ ప్రాంతంలో జరిగే మతపరమైన ర్యాలీకి ఆయన విధుల్లో ఉన్నారు.
డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నవాజ్ గష్కోరి వాహనం సమీపంలో బాంబర్ తనను తాను పేల్చుకున్నాడని సీనియర్ పోలీసు అధికారిని ఉటంకిస్తూ రాయిటర్స్ పేర్కొంది. పేలుడుకు బాధ్యులమని ఎవరూ ప్రకటించలేదు. పాకిస్తాన్ తాలిబాన్ (TTP) ఒక ప్రకటనలో వారి ప్రమేయాన్ని ఖండించింది. సెప్టెంబర్‌లో మస్తుంగ్ జిల్లాలో ఇది రెండో అతిపెద్ద పేలుడు. ఈ నెల ప్రారంభంలో జరిగిన పేలుడులో జమియాత్ ఉలేమా-ఎ-ఇస్లాం ఫజల్ (JUI-F) నాయకుడు హఫీజ్ హమ్దుల్లాతో సహా పలువురు గాయపడ్డారు.