సెంట్రల్ ప్యారిస్‌లో శుక్రవారం జరిగిన కాల్పుల ఘటనలో కనీసం ఇద్దరు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. వివరాల ప్రకారం.. కుర్దిష్ సాంస్కృతిక కేంద్రం పరిసరాల్లో కాల్పుల ఘటన జరిగినట్లు ఫ్రెంచ్ టెలివిజన్ నెట్‌వర్క్ BFM టీవీ నివేదించింది. ఈ సంఘటనను పారిస్ సిటీ హాల్‌లోని సీనియర్ అధికారి ఒకరు ధృవీకరించారు.
"తుపాకీ దాడి జరిగింది. వేగవంతమైన చర్యకు భద్రతా దళాలకు ధన్యవాదాలు" అని డిప్యూటీ మేయర్ ఇమ్మాన్యుయేల్ గ్రెగోయిర్ ట్వీట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను స్థానిక జర్నలిస్టు ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.
పారిస్ పోలీసులు రూ డి ఎన్‌గిన్‌లో జరిగిన సంఘటనతో.. ఆ ప్రాంతానికి దూరంగా ఉండాలని ప్రజలను కోరారు. అనుమానిత సాయుధుడుకి 60 ఏళ్ల వయస్సు ఉంటుందని, అరెస్టు చేసినట్లు BFM TV నివేదించింది. కాల్పులకు తెగబడిన షూటర్ ఉద్దేశం ఏంటి అనేది స్పష్టంగా తెలియలేదు. వీధిలో అల్లకల్లోలం సృష్టిస్తూ ఏడెనిమిది రౌండ్ల కాల్పులు జరిగాయని ప్రత్యక్ష సాక్షి ఒకరు ఫ్రెంచ్ వార్తా సంస్థ AFPకి తెలిపారు.