పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని పర్వత ప్రాంతంలో బుధవారం ప్యాసింజర్ వ్యాన్ వందల అడుగుల లోయలో పడటంతో 18 మంది మరణించగా, పలువురు గాయపడ్డారని ఓ అధికారి తెలిపారు. జోబ్ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వ్యాన్ కిల్లా సైఫుల్లా ప్రాంతానికి సమీపంలో లోయలోకి పడిపోయిందని డాన్ వార్తాపత్రిక నివేదించింది. అఖ్తర్‌జాయ్ సమీపంలోని కొండపై నుంచి వాహనం పడిపోయిందని.. ఈ ప్రమాదంలో అందులోని 18 మంది ప్రయాణికులు మరణించారని డిప్యూటీ కమిషనర్ హఫీజ్ ముహమ్మద్ ఖాసిమ్ తెలిపారు.
అఖ్తర్జాయ్ అనేది జోబ్‌లో 1,572 మీటర్ల ఎత్తులో ఉన్న గిరిజన ప్రాంతం. కొండ ప్రాంతం అవడంతో క్షతగాత్రులను, మృతదేహాలను ఆస్పత్రికి తరలించేందుకు ఇబ్బందులు పడుతున్నామని డిప్యూటీ కమిషనర్ తెలిపారు. బాధితుల సౌకర్యార్థం ఆ ప్రాంతంలోని అన్ని ఆసుపత్రుల వద్ద అత్యవసర పరిస్థితిని విధించినట్లు ఖాసీం కాకర్ తెలిపారు. గాయపడిన వారిలో 13 ఏళ్ల బాలుడి పరిస్థితి విషమంగా ఉందని డిప్యూటీ కమిషనర్ తెలిపారు.