బంగారు గని కూలి 18 మంది మరణించిన ఘటన దక్షిణ నైజర్‌లో చోటు చేసుకుంది. నైజీరియా సరిహద్దుకు సమీపంలోని ఆర్టిసానల్ గోల్డ్‌మైన్‌లో ఈ ప్రమాదం జరిగిందిన స్థానిక మేయర్ తెలిపారు. గ్యారిన్ - లిమాన్ బంగారు గని ప్రాంతంలో ఆర్టిసానల్ బావులు కూలి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 18 మంది మరణించగా మరో ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గని అడుగున ఇంకా కొన్ని మృతదేహాలు ఉండవచ్చని స్థానికులు అంటున్నారు.
కొన్ని నెలల క్రితమే గ్యారిన్ - లిమాన్ బంగారు గనులను కనుగొన్నారు. అక్కడికి వేలాది మంది మైనర్లు చేరి బంగారం కోసం తవ్వకాలు జరుపుతున్నారు. గని కూలిన ఘటనలో వెలికి తీసిన మృతదేహాలను ఖననం చేశామని డాన్ ఇస్సా జిల్లా మేయర్ అడమౌ గురౌ తెలిపారు. దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో గోల్డ్ కోసం తవ్వకాలు జరుగుతున్నాయి. మట్టి అస్థిరతతో పాటు మైనర్లు ఉపయోగించిన కాలం చెల్లిన పద్ధతుల కారణంగా ఈ బంగారు గనుల్లో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.