డబ్బుతో వెళుతున్న వాహనాన్ని కొల్లగొట్టాలని చూసిన దొంగలను పోలీసులు కాల్చి పడేశారు. దక్షిణాఫ్రికాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దోపిడీ సమయంలో మరణించిన దొంగల సంఖ్య 10కి పెరిగిందని పోలీసులు తెలిపారు. ఇటీవలి సంవత్సరాలలో దేశంలో జరిగిన అత్యంత ఘోరమైన కాల్పుల్లో ఒకటి. నగదు తీసుకెళ్తున్న వాహనంపై దాడికి ప్లాన్ చేసిన ఎనిమిది మంది అనుమానితులను పోలీసులు హతమార్చినట్లు పోలీసు మంత్రి భేకీ సెలే గతంలో నివేదించారు. ఇప్పుడు ఆ సంఖ్య 10కి చేరింది. స్వతంత్ర పోలీసు ఇన్వెస్టిగేటివ్ డైరెక్టరేట్ (IPID) ప్రతినిధి గ్రేస్ లంగా మాట్లాడుతూ.. ఈ ఘటనలో ఐదుగురు పోలీసు అధికారులు గాయపడ్డారని ధృవీకరించారు.
దక్షిణ జోహన్నెస్‌బర్గ్‌లోని సబర్బ్‌లోని రోసెట్టెన్‌విల్లేలో ప్లాన్డ్ క్యాష్-ఇన్-ట్రాన్సిట్ దోపిడీని నిరోధించడానికి పోలీసులలు ప్రయత్నించారు. ఏకంగా ఓ హెలికాప్టర్‌ను మోహరించారు. అనుమానితులు పోలీసు హెలికాప్టర్‌పై కాల్పులు జరిపారు. పైలట్‌లలో ఒకరిని గాయపరిచారు, దీంతో పోలీసులు తిరిగి కాల్చవలసి వచ్చింది. ఆగ్నేయ క్వాజులు-నాటల్ ప్రావిన్స్‌తో పాటు, జింబాబ్వే, బోట్స్వానాలకు చెందిన దాదాపు 25 మంది ముఠా ఈ దోపిడీకి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. ప్రాణాలతో బయటపడిన ముఠా సభ్యుల్లో ఎనిమిది మందిని అరెస్టు చేశామని, మిగిలిన వారు పరారీలో ఉన్నారని తెలిపారు.
నేరాలు ఎక్కువగా జరుగుతున్న దక్షిణాఫ్రికాలో నగదు రవాణా చేసే వాహనాలను దొంగలు తరచుగా టార్గెట్ చేస్తుంటారు. అక్టోబర్- డిసెంబర్ 2021 మధ్య ఇలాంటి దోపిడీలు 60 దాకా జరిగాయని పోలీసులు తెలిపారు.