భర్త వయసు 93, భార్య వయసు 89.. కరోనా వైరస్ ఏమీ చేయలేకపోయింది
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 24 July 2020 6:38 AM GMTవయసు పైబడిన వారిపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతోంది. అందుకే 55-60 వయసు పైబడిన వ్యక్తులు బయటకు రావద్దని కోరుతూ అధికారులు ప్రచారం చేస్తున్నారు. కేరళకు చెందిన వృద్ధ దంపతులు కరోనా వైరస్ ను జయించారు. అందుకు వైద్యుల కృషి మాత్రమే కారణం కాదు.. వారి ప్రేమ కూడా కారణమని అంటున్నారు. ఆసుపత్రిలో చోటుచేసుకున్న పరిణామాలే అందుకు నిదర్శనమని చెబుతున్నారు.
భారత్ కు చెందిన వృద్ధ దంపతులైన 93 సంవత్సరాల థామస్ అబ్రహాం, 89 సంవత్సరాల మరియమ్మలకు కరోనా వైరస్ సోకింది. కేరళలోని పతనంతిట్ట జిల్లాకు చెందిన ఈ జంట.. ప్రేమ కారణంగానే ప్రాణాలను నిలబెట్టుకుంది.
వీరి కుమారుడు ఇటలీ నుండి మార్చి నెలలో వచ్చాడు.. అతడి నుండి వీరికి కరోనా వైరస్ సోకింది. దీంతో థామస్, మరియమ్మను ఆసుపత్రిలో చేర్చారు. 25 రోజుల పాటూ ఆసుపత్రి లోనే ఉన్నారు.. చాలా వరకూ ఐసీయు లోనే ఉన్నారు. థామస్, మరియమ్మల వయసు పైబడడంతో అనేక అనారోగ్య సమస్యలు కూడా వచ్చి చేరాయి. డయాబెటిస్, హైపర్ టెన్షన్, హృద్రోగాలు వారిని ఇబ్బంది పెట్టాయి.
ఆసుపత్రిలో వారిని చేర్చిన సమయంలో థామస్ ను వెంటిలేటర్ పై పెట్టారు. అతడికి కార్డియాక్ అరెస్ట్ కూడా అయ్యింది. వారి ఆరోగ్యం రోజురోజుకీ క్షీణించసాగింది. వారిని ఆసుపత్రిలో ప్రత్యేక గదుల్లో ఉంచారు వైద్యులు. 'పెళ్ళైన తర్వాత మేమెప్పుడూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేదు.. ఒక్క సెకను కూడా ఒకరు లేకుండా మరొకరు ఉండగలమనే ఊహ కూడా తమకు వచ్చేది కాదు అని అన్నారు' థామస్. 73 సంవత్సరాల వివాహ బంధం తమది అని చెప్పుకొచ్చారు. థామస్ వయసు 20, మరియమ్మ వయసు 16 ఉన్నప్పుడు వారికి పెళ్లి చేశారు.
వారిని ఒక్కో గదిలో ఉంచడం వలన మానసికంగా ఏమైనా ప్రభావం చూపిందేమోనని ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు భావించారు. వెంటనే వారిద్దరినీ ట్రాన్స్పరెంట్ ఐసీయు లో ఉంచారు. వారిద్దరూ ఒకరినొకరు చూసుకునేలా ఏర్పాట్లు చేయడంతో వారి పరిస్థితిలో మెరుగైన మార్పు వచ్చింది. కరోనా వైరస్ నుండి కోలుకోగలిగారు.. ఆరోగ్యం పూర్తిగా మెరుగై మునుపటి లాగా తమ పనులు తామే చేసుకునే స్థాయికి వచ్చారు. ఈ అద్భుతాన్ని చూసి వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు. వారి ప్రేమే వారిని కోలుకునేలా చేసిందని వైద్యులు భావిస్తూ ఉన్నారు.
ఆసుపత్రిలో ఉన్న సమయంలో వారు తమ పిల్లలను, మనవళ్లు, మనవరాళ్లను తిరిగి చూస్తామని అనుకోలేదు.. ఇంకో క్రిస్మస్ ను కలిసి చేసుకుంటామో కూడా తెలీదని.. రాత్రిళ్ళు ఏడుస్తూ వాళ్ల పేర్లు తలచుకుంటూ ఉండే దానినని మరియమ్మ తెలిపింది.
ప్రస్తుతం వారు కరోనాను జయించి తమ ఇంట్లో ఉంటున్నారు. చుట్టుపక్కల ఉన్న సీనియర్ సిటిజన్లతో ఎప్పటి లాగే మాట్లాడుతూ ఉన్నారు. ఏది ఏమైనా వారి దాంపత్యమే కరోనాను జయించేలా చేసిందని స్థానికులు చెబుతున్నారు. కరోనాకు భయపడకండి.. పోరాడవచ్చు.. పోరాడి గెలవ వచ్చు అని ఈ జంట ఎంతో మందిలో స్ఫూర్తిని నింపుతోంది. వీరి గురించి సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున పోస్టులు వైరల్ అవుతున్నాయి.