క్రికెట్‌కే ప్రాధాన్యం.. త్వ‌ర‌లో ఆత్మ‌క‌థ‌ను రాస్తా.. : శ‌్రీశాంత్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 May 2020 10:05 PM IST
క్రికెట్‌కే ప్రాధాన్యం.. త్వ‌ర‌లో ఆత్మ‌క‌థ‌ను రాస్తా.. : శ‌్రీశాంత్

రాబోయే ఐదు సంవత్సరాలు క్రికెట్‌కే ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు టీమ్ఇండియా క్రికెటర్ శ్రీశాంత్ అన్నాడు. శుక్రవారం హ‌లో యాప్ లైవ్‌లో శ్రీశాంత్ అభిమానుల‌తో మాట్లాడాడు. ఈ సందర్భంగా క్రికెట్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను అభిమానుల‌తో పంచుకున్నాడు.

ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో క‌ఠినమైన రోజులు కొన్ని ఉంటాయ‌ని, అయితే.. అవి ఎల్లకాలం ఉండ‌వ‌ని చెప్పాడు శ్రీశాంత్. త‌న జీవితంలో జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌లు మాత్ర‌మే బ‌య‌టి ప్ర‌పంచానికి తెలుసున‌ని త్వ‌ర‌లోనే పుస్త‌క రూపంలో త‌న ఆత్మ‌క‌థ‌ను తీసుకురానున్న‌ట్లు వెల్ల‌డించాడు. అయితే ఇందుకు ఐదేళ్ల స‌మ‌యం ప‌ట్ట‌వ‌చ్చున‌ని తెలిపాడు. త‌న ఆత్మ‌క‌థ‌లో క్రికెట్ కెరీ‌ర్‌లో ఎదుర్కొన్న ఆటుపోటుల‌తో పాటు తానెంత మాన‌సిక క్షోభ‌ను అనుభ‌వించాను అనే విష‌యాల‌ను అందులో పొందుప‌ర‌చ‌నున్న‌ట్లు చెప్పాడు. ఇక కోపంలో మాత్రం ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకోవ‌ద్ద‌ని సూచించాడు.

ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో ఎప్పుడు ఏదైనా జ‌ర‌గ‌వ‌చ్చున‌ని అనుకోని జ‌ర‌గ‌డ‌మే జీవిత‌మ‌న్నాడు. త‌న జీవితంలో మైకేల్ జోర్డాన్ దగ్గర శిక్షణ తీసుకుంటానని అనుకోలేదని కానీ తీసుకోవాల్సిన ప‌రిస్థితులు వ‌చ్చాయ‌న్నాడు. అందుకు తానేం బాధ‌ప‌డ‌డం లేద‌ని, అతని వద్ద శిక్షణ తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నాడు. స‌మ‌స్య‌ల‌ను ఎలా ఎదుర్కోవాలో నేర్చుకున్న‌ట్లు తెలిపాడు.

ఈ రోజుల్లో ప్ర‌తీది ఆన్‌లైన్‌లో దొరుకుతోంద‌ని, ఏదైనా సాధించాల‌ని అనుకుంటే మిమ్మ‌ల్ని ఎవ‌రూ ఆప‌లేర‌ని అన్నాడు. ప్ర‌స్తుతం లాక్‌డౌన్ కార‌ణంగా బ‌య‌టికి వెళ్ల‌లేని ప‌రిస్థితులు ఉన్నాయ‌ని, కానీ.. ఈ లాక్‌డౌన్ కాలాన్ని స‌రిగ్గా ఉప‌యోగించుకోగ‌లిగితే అద్భుతాలు చేయ‌వ‌‌చ్చున‌ని తెలిపాడు.

వ‌న్డేల్లో 100 తీయాల‌ని ఉంది..

ఈ స‌మ‌యంలో అభిమానులు అడిగిన ప‌లు ప‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పాడు శ్రీశాంత్. ఒక‌వేళ క్రికెట్ మ‌ళ్లీ మీరు రీ ఎంట్రీ ఇస్తే ఏం రికార్డులు సాధించాలని అనుకుంటున్నారు అన్న ప్ర‌శ్న‌కు వ‌న్డేల్లో 100 వికెట్ల‌తో పాటు టెస్టులో కూడా కొన్ని వికెట్లు తీయాల‌ని కోరుకుంటున్న‌ట్లు చెప్పాడు.

తాను ఎర్ర బంతి బౌలర్ అని నమ్ముతానని చెప్పిన శ్రీశాంత్.. రికార్డుల కంటే జట్టు గెలుపు కోసం ప్రయత్నిస్తానని తెలిపాడు. తాను క్రికెట‌ర్ అవ్వ‌డానికి కార‌ణం త‌న మామ‌య్య అని తెలిపాడు. త‌న‌కు క్రికెట్‌కు ప‌రిచ‌యం చేసిందే మామ‌య్య అని చెప్పుకొచ్చాడు. క్రికెట్‌లో ఉన్న ప‌లు రికార్డుల నుంచే తాను ప్రేర‌ణ పొందాన‌ని కొన్ని రికార్డుల‌నైనా త‌న‌కు బ్రేక్ చేయాల‌నుంద‌న్నాడు.

క్రికెట్ ఆడ‌ని రోజుల్లో ఆర్థిక క‌ష్టాల నుంచి గ‌ట్టెంచింది సినిమాలేన‌ని పేర్కొన్నాడు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌‌లలో పలు సినిమాల్లో నటించానని చెప్పాడు. ప్రస్తుతం కూడా ఒక మరాఠీ సినిమా చేస్తున్నానని, గతంలో 18 రోజుల షూటింగ్ అని చెప్పడంతో ఓ మరాఠీ సినిమా కూడా ఒప్పుకున్నానని.. ఆ సినిమా పేరు 'ముంబై క వడపావ్' అని శ్రీశాంత్ తెలిపాడు.

స్పాట్ ఫిక్సింగ్ ఆరోప‌ణ‌ల‌తో శ్రీశాంత్ పై విధించిన జీవిత‌కాల నిషేదాన్ని బీసీసీఐ ఏడేళ్ల‌కు త‌గ్గించిన సంగ‌తి తెలిసిందే. ఈ నిషేదం ఈ ఏడాది ఆగ‌స్టులో ముగియ‌నుంది. ఈ నేప‌థ్యంలో మ‌ళ్లీ ప్రొఫెష‌న‌ల్ క్రికెట్ ఆడాల‌ని భావిస్తున్నాడు ఈ కేర‌ళ ఆట‌గాడు.

Next Story