ధోని మీరు అనుకున్నంత కూల్ కాదు : గ‌ంభీర్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 May 2020 2:14 PM GMT
ధోని మీరు అనుకున్నంత కూల్ కాదు : గ‌ంభీర్‌

భార‌త మాజీ కెప్టెన్ మ‌హేంద్ర‌సింగ్ ధోని ని అభిమానులు ముద్దుగా మిస్ట‌ర్ కూల్ అని పిలుచుకుంటారు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మ‌హీ మైదానంలో ప్ర‌శాంత‌త‌ను కోల్పోడు. మ‌హీ కోప్ప‌డిన సంద‌ర్భాలు చాలా అరుదు. అయితే.. మ‌హేంద్రుడు కూడా మైదానంలో స‌హ‌నం కోల్పోవ‌డం చాలా సార్లు చూశాన‌ని అంటున్నాడు భార‌త మాజీ ఆటగాడు గౌత‌మ్ గంభీర్‌.

లాక్‌డౌన్ కార‌ణంగా క్రీడ‌ల‌న్నీ నిలిచిపోవ‌డంతో ఈ మాజీ ఓపెన‌ర్ ఇటీవ‌ల ఓ క్రికెట్ ఛానెల్ నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్నాడు. ఈ సంద‌ర్భంగా ప‌లువు‌రు ఆట‌గాళ్ల గురించి ఆస‌క్తిక‌ర అంశాల‌ను వెల్ల‌డించాడు. ధోని గురించి మాట్లాడుతూ.. ధోని కూల్‌గా ఉంటాడ‌ని చాలా మంది అంటుంటారు కానీ అందులో ఏ మాత్రం నిజంలేద‌న్నాడు. 2007 టీ20 ప్ర‌పంచ‌క‌ప్ తో పాటు మేజ‌ర్ టోర్నీల‌లో ఆట‌గాళ్లు స‌రిగ్గా రాణించ‌కుంటే ధోని ఆవేశాన్ని ప్ర‌దర్శించాడ‌న్నాడు. ధోని కూడా మాన‌వ‌మాత్రుడేన‌ని, కాబ‌ట్టి కోపం అనేది స‌హ‌జమ‌న్నాడు. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో ఆడేట‌ప్పుడు ఎవ‌రైనా మిస్‌ఫీల్డింగ్ చేస్తే ధోని ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. అయితే.. టీమ్ఇండియాకు కెప్టెన్లుగా చేసిన వారితో పోలిస్తే మాత్రం ధోని చాలా కూల్ అనేది వాస్త‌వ‌మనీ గంభీర్ చెప్పాడు. అయితే ప్ర‌తీ విష‌యంలో మాత్రం కాద‌నీ, త‌న కంటే మాత్రం ధోనినే చాలా కూల్ గా ఉంటాడ‌ని వెల్ల‌డించాడు ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్‌.

కాగా.. ధోని కెప్టెన్సీలోనే భార‌త్ 2007 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌, 2011 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లు గెలిచింది. ఈ రెండు ప్ర‌పంచ‌క‌ప్‌లు గెలిచిన భార‌త జ‌ట్టులో గంభీర్ స‌భ్యుడు. 2011 ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్‌లో గంభీర్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భార‌త ఫాస్ట్ బౌల‌ర్ ష‌మీ కూడా ఓ సంద‌ర్భంలో ధోని చేత తాను కూడా తిట్లు తిన్న విష‌యాన్ని చెప్పిన సంగ‌తి తెలిసిందే.

Next Story
Share it