ఇండియా పేరును అలా మార్చాలట.. సుప్రీంలో పిటిషన్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 30 May 2020 5:23 PM ISTఇప్పుడున్న సమస్యలు సరిపోవన్నట్లు.. ఇప్పుడు మరో భారీ చర్చకు తెర తీసేలా సుప్రీంలో ఒక పిటిషన్ దాఖలైంది. దీని ప్రకారం ఇండియా పేరును భారత్ కానీ హిందూస్థాన్ గా మార్చాలంటూ వ్యాజ్యం దాఖలైంది. దేశం పేరును మార్చేలా రాజ్యాంగాన్ని సవరించాలని అందులో పేర్కొన్నారు. ఈ అంశంపై కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఇంతకీ ఈ చిత్రమైన వాదనను తెర మీదకు తెచ్చిన పెద్ద మనిషి ఎవరంటే.. ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తిగా చెబుతున్నారు.
ఇండియా పేరును భారత్ కానీ హిందూస్థాన్ అన్న పేరుతో మారిస్తే.. దేశ ప్రజల్లో జాతీయత భావం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. దేశం పేరు మార్చటానికి వీలుగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 1లో సవరణలు చేసేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ పేరు మార్పుతో దేశ ప్రజలు గతంలో తాము మరొకరి పాలనలో ఉన్నామన్న భావన నుంచి బయటపడతారని పేర్కొన్నారు.
ఇంగ్లీషు పేరును తొలగించి.. ఆ స్థానంలో మరో పదాన్ని చేర్చటం వల్ల దేశ ప్రజల్లో ఆత్మగౌరవం పెరుగుతుందన్నారు. ఇండియా పేరును భారత్ గా మార్చటం వల్ల స్వాతంత్య్రం కోసం పోరాడిన వారిని గుర్తు చేసుకున్నట్లు అవుతుందన్నది పిటిషనర్ వాదన. వాస్తవానికి ఈ వ్యాజ్యాంపై విచారణ శుక్రవారం లిస్టు అయినప్పటికి చీఫ్ జస్టిస్ అందుబాటులోకి లేకపోవటంతో.. దీనిపై విచారణను జూన్ రెండుకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
1948లో భారత రాజ్యాంగాన్ని రూపొందిస్తున్న సమయంలోనే ఇండియా స్థానే భారత్.. హిందూస్తాన్ పేర్లు పెట్టాలని బలమైన వాదన వినిపించింది. కానీ.. ఇండియా పేరును ఫైనల్ చేశారు. ఇన్ని సంవత్సరాల తర్వాత దేశ పేరును మార్చాలన్న పిటిషన్ పై సుప్రీం ఎలా రియాక్టు అవుతుందో చూడాలి.