పౌరసత్వ బిల్లు.. ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు..!

By అంజి  Published on  10 Dec 2019 10:57 AM GMT
పౌరసత్వ బిల్లు.. ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు..!

ఢిల్లీ: పార్లమెంట్‌లో కేంద్రప్రభుత్వం పౌరసత్వ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. దీంతో బిల్లుకు వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రజలు ఆందోళనలు కార్యక్రమాలు చేపట్టారు. పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలపడాన్ని వ్యతిరేఖించారు. ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాల్లో బంద్‌ కొనసాగుతోంది. చైనా, మయన్మార్‌, బంగ్లాదేశ్‌, భూటాన్‌ దేశాలతో సరిహద్దు పంచుకుంటున్న అసోం, త్రిపురలో ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ నినాదాలు చేశారు. ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్లకార్డులతో నిరసన తెలిపారు. విదేశీ శరణార్థులకు పౌరసత్వం కల్పిస్తే తమ జీవనానికి ఇబ్బందులు ఏర్పాడతాయని ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.

పక్క దేశాల నుంచి వచ్చిన శరణార్థులకు భారత పౌరసత్వం కల్పిస్తూ పౌరసత్వ బిల్లుకు సవరణలు చేపడుతూ ప్రవేశ పెట్టిన బిల్లుకు సోమవారం అర్థరాత్రి లోక్‌సభ ఆమోదం తెలిపింది. పౌరసత్వ సవరణ బిల్లుపై ఓటింగ్‌ నిర్వహించంగా 311 మంది అనుకూలంగా, 80 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందినట్లు స్పీకర్‌ ప్రకటించారు. గౌహతి యూనివర్సిటీ, దిబ్రుగఢ్‌ యూనివర్సిటీ పరీక్షలను అధికారులు వాయిదా వేశారు. ప్రజల ఆందోళన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజల ఆందోళనకు స్థానిక రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. వ్యాపార సంస్థలు, స్కూళ్లు, కాలేజీలు, దుకాణాలు మూతపడ్డాయి. కాగా నాగాలాండ్‌ ప్రజలు హార్న్‌బిల్‌ పండుగ ఉండడంతో ఈ ఆందోళనలకు దూరంగా ఉన్నారు. శరణార్థులకు పౌరసత్వం కల్పిస్తే తమ సంస్కృతి, సంప్రదాయాలు దెబ్బ తింటాయని ఈశాన్య రాష్ట్రాల ప్రజల ఆరోపిస్తున్నారు. కాగా మొదటి నుంచి ఈ బిల్లును ఈశాన్య రాష్ట్రాల ప్రజలు వ్యతిరేకిస్తూనే వస్తున్నారు.

Next Story