ధోని నమ్మకుంటే.. భగవంతుడు కూడా కాపాడలేడు

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 11 July 2020 8:43 PM IST

ధోని నమ్మకుంటే.. భగవంతుడు కూడా కాపాడలేడు

భారత్‌లో విజయవంతమైన కెప్టెన్లలో ధోని ఒకడు. టీమ్‌ఇండియాకు రెండు ప్రపంచకప్‌లు(2007 టీ20, 2011 వన్డే) అందించడంతో పాటు 2013 ఐసీసీ చాంఫియన్స్‌ ట్రోఫి ధోని నాయకత్వంలోనే భారత జట్టు గెలిచింది. ధోని ఓ ఆటగాడిని నమ్మకపోతే.. అతడినిని దేవుడు కూడా కాపాడలేడని భారత మాజీ ఆటగాడు, చెన్నై సూపర్‌ కింగ్స్ ప్లేయర్ బద్రీనాథ్‌ అభిప్రాయపడ్డాడు.

2010,11 ఐపీఎల్‌ సీజన్లలో చెన్నై టైటిల్‌ విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు బద్రీనాథ్‌. తాజాగా మీడియాతో మాట్లాడాడు. జట్టులో ప్రతి ఒక్కరి పాత్ర చాలా కీలకమని ధోని ఎప్పుడు భావిస్తాడని, అందుకే జట్టులోని ప్రతి ఆటగాడికి ఒక్కో బాధ్యతను అప్పజెప్పుతాడన్నాడు. మిడిల్‌ ఆర్డర్‌లో స్కోర్‌ బోర్డును ముందుకు నడిపించడమే తన బాధ్యతన్నాడు. ఆటగాళ్లను తమను తాము నిరూపించుకోవడానికి తగినన్ని అవకాశాలు ఇస్తాడని, ధోని ఓ ఆటగాడిని నమ్మితే జట్టులో చోటు ఖాయమని.. అతడి నమ్మకాన్ని కోల్పోతే మాత్రం.. ఇక దేవుడు కూడా సాయం చేయలేడన్నాడని తెలిపాడు. ధోని ఏదైతే కరెక్ట్‌ అని నమ్ముతాడో దానికి కట్టుబడి ఉంటాడని, ఆటగాళ్లు అలా అవకాశాలిచ్చి వారిని వారే నిరూపించుకునేలా చేస్తాడని బద్రీనాథ్ చెప్పాడు.

'చెన్నై జట్టు మ్యాచులు గెలిచినా.. ఓడినా.. ఒకే విధంగా ఉండేది. ఇక జట్టు యాజమాన్యం కూడా అందరిని ఒకేలా చూసేది. మా అందరి మధ్య మంచి అనుబంధం నెలకొంది. మా యాజమాన్యం ఎప్పుడూ మమ్మల్ని చాంఫియన్లుగానే బావించింది. ధోని మా జట్టుకు కెప్టెన్‌గా ఉండడంతో టాప్ ఆర్డర్‌ నుంచి లోయర్‌ ఆర్డర్‌ వరకు ఛాంపియన్లుగానే మేం భావించే వాళ్లమని' బద్రీనాథ్ అన్నాడు. నేను ధోనీ నుండి నేర్చుకున్న ఒక విషయం ఏమిటంటే.. మ్యాచ్ సజావుగా సాగుతున్నప్పుడు దాన్ని దెబ్బతీయకుండా ఉంటాడు. అతడి ఏ నిర్ణయమైనా సరైనదిగా ఉంటుందన్నాడు.

తమిళనాడుకు చెందిన ఈ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ టీమిండియా తరుపున 2008 నుంచి 2011 మధ్య కాలంలో రెండు టెస్టులు, ఏడు వన్డేలు, ఓ టీ20 ఆడాడు. ఐపీఎల్‌లో 95 మ్యాచ్‌లు ఆడి 1441 పరుగులు సాధించాడు. ఇందులో 11 అర్థశతకాలు కూడా ఉన్నాయి. ఐపీఎల్‌ 12 సీజన్లు జరగగా.. ఇప్పటి వరకు 9 సార్లు చెన్నై జట్టు ఫైనల్‌ ఆడింది. చెన్నై 3 సార్లు టైటిల్‌ విజేతగా నిలిచింది. ఐపీఎల్‌లో అత్యధికంగా ముంబై ఇండియన్స్‌ నాలుగు సార్లు విజేతగా నిలిచింది.

Next Story