వికెట్‌ తీసిన ఆనందంలో.. నిబంధనలను మరిచాడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 July 2020 8:12 AM GMT
వికెట్‌ తీసిన ఆనందంలో.. నిబంధనలను మరిచాడు

దాదాపు మూడు నెలల విరామం తరువాత వెస్టిండిస్-ఇంగ్లాండ్‌ జట్ల మధ్య టెస్టు సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్ ప్రారంభమైంది. బుధవారం ప్రారంభం అయిన ఈ మ్యాచ్‌తో ఐసీసీ కరోనా నిబంధనలను తీసుకువచ్చింది. ఆటగాళ్లు భౌతిక దూరం పాటించాలని, బంతిపై ఉమ్మి వాడకూడదని, కరచాలనం చేయవద్దని వంటివి ఉన్నాయి. కాగా.. మ్యాచ్‌ మూడవ రోజు ఆటలో ఇంగ్లాండ్‌ ఆటగాడు జేమ్స్‌ అండర్సన్‌ ఓ నిబంధనను బ్రేక్‌ చేశాడు.

అండ‌ర్సన్ వేసిన బంతి చేజ్ మొకాళ్ల‌కు తాకుతూ వెళ్లింది. దాంతో అండ‌ర్స‌న్ ఎల్బీ అప్పీల్‌కు వెళ్ల‌గా అంపైర్ నాటౌట్‌గా ప్ర‌క‌టించాడు. దీంతో కెప్టెన్ స్టోక్స్ డీఆర్ఎస్‌కు వెళ్లగా.. రివ్యూ ఇంగ్లండ్‌కు అనుకూలంగా వచ్చింది. ఆ సంతోషంలో అండ‌ర్స‌న్ త‌న స‌హ‌చ‌ర ఆట‌గాళ్ల ద‌గ్గ‌రికి వెళ్లి ఆనందంతో హ‌త్తుకున్నాడు.

కాగా.. ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో అండర్సన్‌ చేసిన పనికి అందరూ ఫిదా అయ్యారు. మ్యాచ్‌లో భౌతిక దూరం పాటిస్తూ.. కేవలం భుజాలతోనే విషెస్‌ చెప్పడం చూశాం. అండ‌ర్స‌న్ చేసిన ప‌ని క్రికెట్ అభిమానుల‌కు తెగ నచ్చిన సంగతి తెలిసిందే. తాజా ఘటనపై ఐసీసీ స్పందించింది. 'జేమ్స్ అండ‌ర్స‌న్ మొన్న‌నే క‌దా నిన్ను అంతలా మెచ్చుకుంది. ఇంత‌లోనే ఐసీసీ నిబంధ‌న‌లు గాలికొదిలేస్తావా' అంటూ ఐసీసీ త‌న ట్విట‌ర్‌లో పేర్కొంది. ఇంగ్లండ్ మాజీ ఆట‌గాడు నాసిర్ హుసేన్ స్పందించాడు. 'వికెట్ తీశాన‌న్న ఆనందంలో అండ‌ర్స‌న్ అలా చేసి ఉంటాడు. ఎంతైనా పాత ప‌ద్ద‌తులు అంత తొంద‌ర‌గా జీర్ణం కావుగా' అంటూ ట్వీట్ చేశాడు.



ఇంగ్లాండ్‌ జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 204 పరుగులకు ఆలౌట్‌ కాగా.. విండీస్‌ తొలి ఇన్సింగ్స్‌లో 318 పరుగులు సాధించి114 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. విండీస్‌ జట్టులో ఓపెనర్‌ క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ (125 బంతుల్లో 65; 6 ఫోర్లు), వికెట్‌ కీపర్‌ డౌరిచ్‌ (115 బంతుల్లో 61; 8 ఫోర్లు) అర్ధసెంచరీలతో రాణించగా.. ఇంగ్లాండ్‌ బౌలర్లలో బెన్‌స్టోక్స్‌ 4వికెట్లు, అండర్సన్‌ 3 వికెట్లు సాధించి విండీస్‌ భారీ స్కోర్‌ చేయకుండా అడ్డుకున్నారు.

Next Story