నేనే వికాస్ దూబే.. కాన్పూర్ కు చెందినవాణ్ణి అంటూ ఎందుకు గట్టిగా అరిచాడు..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  9 July 2020 10:19 PM IST
నేనే వికాస్ దూబే.. కాన్పూర్ కు చెందినవాణ్ణి అంటూ ఎందుకు గట్టిగా అరిచాడు..?

ఉత్తరప్రదేశ్‌లో 8 మంది పోలీసులను కాల్చి చంపి వారం రోజుల నుంచి తప్పించుకు తిరుగుతున్న మోస్ట్‌వాంటెడ్‌ గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే అరెస్ట్‌ అయ్యాడు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాన్పూర్‌లో 8 మంది పోలీసులను హతమార్చిన కేసులు దూబే ప్రధాన నిందితుడు. వికాస్‌ దూబే అనుచరుల్లో ముగ్గురిని పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. బుధవారం ఒకరు, గురువారం ఇద్దరు అనుచరులను పోలీసులు కాల్చి చంపారు. దూబేపై ఇప్పటి వరకు 60 క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్ పోలీసులు ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ పోలీసులకు అప్పగించారు.

కాన్పూర్ లో ఎన్‌కౌంటర్‌ అనంతరం దూబే మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశించి అక్కడి పలు ప్రాంతాల్లో ముఖానికి మాస్కు, నకిలీ గుర్తింపు కార్డుతో తిరుగుతున్నాడు. దూబేను గుర్తించింది ఉజ్జయిని మహాకాళీ ఆలయ సెక్యూరిటీ సిబ్బంది అని అధికారులు తెలిపారు. దైవ దర్శనానికి ఉజ్జయిని మహాకాళీ మందిరానికి వికాస్‌ దూబే రాగా అక్కడి సెక్యూరిటీ సిబ్బంది అతడిని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు దూబేను పట్టుకున్నారు. తనను పట్టుకోగానే తాను వికాస్ దూబేనని ‌ ఒప్పుకున్నాడు.

వికాస్ దూబేను అరెస్ట్ చేసే సమయంలో గట్టిగా అరిచిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 'మై వికాస్ దూబే హూ.. కాన్పూర్ వాలా' అంటూ గట్టిగా అరిచాడు. నేను వికాస్ దూబేను కాన్పూర్ కు చెందిన వాణ్ణి అంటూ అతడు అరవడాన్ని పలువురు కెమెరాల్లో రికార్డు చేశారు. తన అనుచరులను పోలీసులు ఎన్ కౌంటర్ చేస్తున్న తరుణంలో తనను కూడా ఎక్కడ ఎన్ కౌంటర్ చేస్తారోనని భయపడి వికాస్ దూబే గట్టిగా అరిచినట్లు తెలుస్తోంది. తనను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారని ప్రపంచానికి తెలియజేయాలనే అతడు అలా గట్టిగా అరిచినట్లు పలువురు భావిస్తూ ఉన్నారు. పోలీసు వాహనానికి అతడిని అదిమిపట్టేసి బేడీలు వేసే సమయంలో అతడు అలా గట్టిగా అరిచాడు.

లక్నోలోని కృష్ణానగర్ లో దూబే భార్య, కుమారుడు, ఇద్దరు నౌకర్లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులపై కాల్పులు జరిపిన ఘటనలో దూబే భార్య, కుమారుడి పాత్ర కూడా ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. వికాస్ దూబేను పట్టుకోడానికి 25 స్పెషల్ టీమ్స్ ను ఏర్పాటు చేసినా కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండి తప్పించుకోవడం పెద్ద చర్చనీయాంశమైంది.

మొదట అతడిని పట్టుకోడానికి 50 వేలు ప్రకటించిన ప్రభుత్వం.. చివరికి 5 లక్షల దాకా పెంచుకుంటూ వెళ్లిపోయారు. వికాస్ దూబే పోలీసుల మీద దాడి చేయడానికి కారణం పోలీసు డిపార్ట్మెంట్ లో ఉన్న వారేనన్న అభియోగాలు కూడా నమోదయ్యాయి. పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తున్నారని తెలుసుకున్న దూబే తన అనుచరులను అలర్ట్ చేశాడు.

గ్రామంలోని ఇళ్ల మీదకు ఎక్కిన దూబే అనుచరులు ఏకే-47 లాంటి మారణాయుధాలతో పోలీసుల మీద దాడి చేశారు. ఈ దాడిలో ఎనిమిది మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుండి తప్పించుకు తిరుగుతున్న దూబే ఎట్టకేలకు ఉజ్జయినిలో పోలీసులకు చిక్కాడు.

Next Story